ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు విడుదల..గత 12 ఏళ్లలోనే అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం

Spread the love

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఈమేరకు ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు. అలాగే, 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో గత 12 ఏళ్లలోనే అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం నమోదు కావడం సంతోషకరమని లోకేష్ పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలో 77%, రెండో సంవత్సరంలో 81% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఇది గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ ప్రదర్శన. ముఖ్యంగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో మెరుగుదల అద్భుతంగా ఉందని వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (GJCs) మొదటి సంవత్సరం విద్యార్థులు 54% ఉత్తీర్ణత సాధించారు, ఇది గత 12 ఏళ్లలో అత్యధికమని తెలిపారు. రెండో సంవత్సరంలో 68% ఉత్తీర్ణత నమోదైంది, ఇది గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ ఫలితమని తెలిపారు. ఈ విజయం విద్యార్థుల కృషికి, ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్ల అంకితభావానికి మరియు విద్యా నాణ్యత కోసం భాగస్వాములందరూ చేసిన ప్రయత్నాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేని వారు అధైర్యపడవద్దని సూచించారు.  దీనిని ఒక గుణపాఠంగా తీసుకుని, మరింత కష్టపడి, పట్టుదలతో ముందుకు సాగాలని భరోసానిచ్చారు.  ఈ సున్నితమైన సమయంలో విద్యార్థులకు నైతిక మద్దతుగా నిలవాలని తల్లిదండ్రులను, కళాశాల యాజమాన్యాలను మరియు సమాజాన్ని కోరారు. విద్యార్థులందరికీ వారి భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.  అందరూ  నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *