శరవేగంగా రూపుదిద్దుకుంటున్న LG ఎలక్ట్రానిక్స్ ప్రపంచ స్థాయి ఉత్పాదక కేంద్రం:మంత్రి లోకేష్ 

Spread the love

శ్రీ సిటీలోని LG ఎలక్ట్రానిక్స్ వారి రూ.5,000 కోట్ల ప్రపంచ స్థాయి ఉత్పాదక కేంద్రం అత్యంత వేగంగా రూపుదిద్దుకుంటోందని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మే 2025లో భూమి అప్పగించినప్పటి నుండి నేటి వరకు అద్భుతమైన పురోగతి అంటూ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.  247 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్, భారతదేశంలో LGకి 3వ ఉత్పాదక కేంద్రం కానుందని తెలిపారు.  ఇక్కడ రిఫ్రిజిరేటర్లు, ACలు, వాషింగ్ మెషీన్లు మరియు కీలకమైన విడిభాగాలను తయారు చేస్తారని ఇది ఆంధ్రప్రదేశ్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా వేలాది మందికి ఉపాధిని కల్పిస్తుందన్నారు.  2026 చివరి నాటికి ఉత్పత్తిని ప్రారంభించి, 2029 వరకు దశల వారీగా విస్తరించాలని ప్రణాళిక రూపొందించారని వివరించారు. పారిశ్రామిక ప్రగతిలో ఈ ముందడుగును చూసి సంతోషం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు, యువతకు మరియు ఉద్యోగ కల్పనకు ఆంధ్రప్రదేశ్ నిరంతరం అండగా నిలుస్తోందంటూ లోకేష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.