
Minister Nara Lokesh: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో ఏపీ ఆక్వా రంగం సంక్షోభంలో పడిపోయింది. ఆక్వాపై ఆధారపడిన అనుబంధ రంగాలపై అమెరికా సుంకాలు తీవ్ర ప్రభాన్ని చూపాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో మార్కెట్ లో రొయ్యల ధరలు పతనమయ్యాయి. ఏపీ నుంచి రొయ్యలు 90 శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అందులోనూ ఎక్కువ భాగం అమెరికాదే. జపాన్, చైనా వంటి దేశాలకు మన రొయ్యలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అయితే భారీ సుంకాలతో రొయ్యల దిగుమతికి అమెరికా డోర్ క్లోజ్ చేసినా..ఆస్ట్రేలియా రూపంలో మరో డోర్ ఓపెన్ అయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు.తెల్ల మచ్చ వైరస్ ఉన్న రొయ్యలను కూడా ఆస్ట్రేలియా దిగుమతికి అనుమతి ఇచ్చిందని మంత్రి తాజాగా అనౌన్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం.
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోవైపు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా లోకేష్ కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా నుంచి లోకేష్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు.ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతిపై ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఆస్ట్రేలియా గతంలో భారత్ నుంచి రొయ్యల దిగుమతుల్ని నిషేధించింది. దీనికి కారణం వైట్ స్పాట్ వైరస్. దీంతో ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. అయితే తాజాగా జరిగిన చర్చల నేపథ్యంలో మన దేశం నుంచి రొయ్యల్ని దిగుమతి చేసుకునేందుకు ఆస్ట్రేలియా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని లోకేష్ తెలిపారు.
ఏపీ రొయ్యల ఎగుమతులకు షరతులతో కూడిన ఆమోదం లభించిందని లోకేశ్ తెలిపారు. ట్వీట్‌లో ఆస్ట్రేలియా అనుమతికి సంబంధించిన డాక్యుమెంట్లను జత చేశారు. 2027 అక్టోబర్ 20వ తేదీ వరకు ఏపీ రొయ్యల్ని ఆస్ట్రేలియా దిగుమతి చేసుకుంటుంది. ఏ, ఏ రకాల రొయ్యలు, ఎప్పుడు, ఎంత ధరకు దిగుమతి చేసుకుంటారనే వివరాలు ఈ డాక్యుమెంట్లలో ప్రస్తావించారు. మొత్తానికి ట్రంప్ సుంకాలకు ఆస్ట్రేలియా రూపంలో ఒక పరిష్కారం దొరికినట్లైంది. ఈ విజయం వెనుక భారత్ ఆస్ట్రేలియా ప్రభుత్వాల కృషి ఎంతో ఉందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకే మార్కెట్‌పై ఆధారపడకుండా.. కొత్త మార్కెట్లను ఓపెన్ చేయడం చాలా ముఖ్యం అన్నారు మంత్రి నారా లోకేష్.
మరోవైపు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా.. సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ ప్రతినిధులతోనూ సమావేశం అయ్యారు. ఏపీ-ఆస్ట్రేలియా మధ్య ఆక్వా ఎగుమతుల అంశంపై వారితో చర్చించారు. ఈ రంగం అభివృద్ధికి సహకారం అందించాలని సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ ప్రతినిధుల్ని కోరారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం సముద్ర ఆహార ఎగుమతులలో 60 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దీని విలువ సుమారు 66వేల కోట్లు . ఆస్ట్రేలియన్లు గ్రేట్ ఆస్ట్రేలియన్ సీఫుడ్ అనే బ్రాండ్‌ను సృష్టించి, తమ సముద్ర ఆహారాన్ని ప్రీమియం గా ప్రచారం చేయడం తనకు చాలా నచ్చిందని లోకేశ్ తెలిపారు. వారు తమ ఉత్పత్తుల విలువను కూడా పెంచుకున్నారన్నారు. వారి నుంచి ఏపీ నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు.ఈ సమావేశం తర్వాత మంత్రి లోకేష్ రొయ్యల దిగుమతి అంశంపై ట్వీట్ చేశారు. Minister Nara Lokesh.
ఏపీ ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే మంత్రి లోకేష్ దూరదృష్టి అభినందనీయం అని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం కొత్త అవకాశాలకు దారితీయనుందన్నారు. అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ఆక్వా ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించాలనే లక్ష్యంతో లోకేష్ ముందుకు సాగుతున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడుల వర్షం కురుస్తోందని, రాష్ట్రానికి 1,000 కిలో మీటర్ల సముద్ర తీరం ఆక్వా పరిశ్రమకు బలమైన ఆధారం అని అన్నారు. నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సాంకేతిక రంగాల్లో లోకేష్ ప్రగతిశీల ఆలోచనలకు అభినందనలు తెలిపారు.