రియాజ్ ఎన్ కౌంటర్.!

Spread the love

Riyaz Encounter Nizamabad: ఈ నెల 17న నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి హత్య చేశాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్‎ను పట్టుకుని పోలీస్ స్టేషన్‎కు తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్‎పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్‎గా తీసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు రియాజ్‎ను అరెస్ట్ చేశారు. నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్‌‌లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో గొడవ పడి గాయాలపాలైన రియాజ్‎ను పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు రియాజ్‎ను ఎన్ కౌంటర్ చేశారు.

నిజామాబాద్‎లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‎ను హత్య చేసిన రౌడీ షీటర్ రియాజ్ పోలీసుల ఎన్ కౌంటర్‎లో హతమయ్యాడు.. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్‎పై దాడి చేసి పారిపోబోతుండగా ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ మరణించాడు. ఈ క్రమంలో రియాజ్ ఎన్ కౌంటర్‎పై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య కీలక ప్రకటన చేశారు.

నిందితుడు రియాజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గది అద్దాలు ధ్వంసం చేశాడు. కానిస్టేబుల్ ఆసిఫ్ చెకింగ్‎లో భాగంగా రియాజ్ గది వద్దకు వెళ్లగా పెద్ద శబ్దం వినిపించటంతో రూమ్‎లోకి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆసిఫ్ దగ్గరున్న తుపాకీ రియాజ్ లాక్కున్నాడు. అనంతరం రియాజ్ ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని సీపీ క్లారిటీ ఇచ్చారు.

రియాజ్ ఎన్ కౌంటర్‎పై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. రియాజ్ చేతిలో గాయపడ్డ కానిస్టేబుల్ ఆసిఫ్ రెండు చేతులకు తీవ్ర గాయ్యాలయ్యాయని.. అతని చేతులు పని చేయాలంటే ఏడాది పడుతుందని డాక్టర్లు చెప్పారని సీపీ తెలిపారు. ప్రొసిజర్ ప్రకారం రియాజ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. Riyaz Encounter Nizamabad.

రియాజ్ ఎన్ కౌంటర్ పై నిజమాబాద్ నగర ప్రజలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. మరో వైపు పోలీసులు సైతం పటా కులు కాల్చి సీట్లు పంచుకున్నారు. రియాజ్ ఎన్ కౌంటర్ పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగొద్దని కోరారు. మరో వైపు రియాజ్ ఎన్ కౌంటర్ తో అతని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హైమద్ పురా లో నిందితుని ఇంటికి బంధువులు చేరుకుంటున్నారు. రియాజ్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే పోలీసులు తమ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు చిన్న పిల్లలను సైతం కొట్టారని రోదించారు… నిందితుడు రియాజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు