రాయలసీమ బిడ్డలపై నిజంగా ప్రేమ ఉంటే.. ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోరా?:జగన్ పై మంత్రి నిమ్మల ఫైర్  

Spread the love

మాజీ సీఎం జగన్ పై ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు.  ఐదేళ్ల పాలనలో రాయలసీమకు జగన్ ఏం చేశారో చెప్పే ధైర్యం ఆయనకు ఉందా? అని ప్రశ్నించారు. పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారని ఎద్దేవా చేశారు.  తెలుగు రాష్ట్రాల నదీ జలాల పంపిణీపై మంత్రి నిమ్మల ప్రజంటేషన్ ఇచ్చారు. తన పదవీకాలంలో జగన్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారు. సాగునీటి రంగానికి వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పలేని పరిస్థితి అని మండిపడ్డారు.  రాయలసీమపై నిజంగా జగన్ కు అంత ప్రేమ ఉంటే ప్రాజెక్టులపై ఎందుకు ఖర్చు చేయలేదు? అని ప్రశ్నించారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఇసుక మాఫియా రాజ్యమేలిందని విమర్శించారు. గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉందని మరమ్మతులకు నిధులు అడిగితే జగన్ పట్టించుకోలేదు. అధికారులు మొరపెట్టుకున్నా రూపాయి కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. చివరికి పులివెందులకు నీళ్లు వెళ్లాలన్నా గోరకల్లులో ఉంటేనే వస్తాయి. దీనికి పైసా ఖర్చు చేయని జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డలపై నిజంగా ప్రేమ ఉంటే.. ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోరా? నీ నిర్లక్ష్యంతో ప్రాజెక్టు కొట్టుకుపోవడం వలన 39మంది చనిపోయినా పరామర్శించని నువ్వు.. ఏమోహం పెట్టుకొని రాయలసీమ గురించి మాట్లాడుతున్నావ్? అని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయన్నారు.