మహానేత వై.ఎస్.ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీలకు,కులాలకు, మతాలకు అతీతంగా పథకాలు అందేవని కానీ నేటి రాజకీయాలు ఇలా లేవని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. అధికార పక్షంతో ఉంటే తప్పా పథకాలు రావు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో పథకాలు ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు సైతం తమ కూటమి కార్యకర్తలకే పథకాలు వర్తింప జేస్తున్నారని ఆరోపించారు. ఇదెక్కడి పద్దతి ? ప్రజలను ప్రజలుగా చూడాలి. ప్రజలకు పార్టీలు అంటగట్టడం తగదని హితవు పలికారు. ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని ప్రజల్లో మార్పు, చైతన్యం రెండూ రావాలన్నారు. నాయకులు బాగుంటే ప్రజలు బాగుంటారు. నాయకుల సిద్ధాంతాలు ప్రజల కోసం రూపొందించాలని అన్న ఆమె వై.ఎస్.ఆర్ నిజమైన ప్రజా నాయకుడని కొనియాడారు. ఇక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం( MGNREGA) పునరుద్దరించాలని ఆమె చేస్తున్న పరిరక్షణ యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది. మన్రేగా చట్టాన్ని పునరుద్ధరించాలని, లేకుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే పాత పథకాన్ని కొనసాగించడంతో పాటు, పని దినాలను 150 రోజులకు వేతనాలు 400 రూపాయలకు పెంచుతామని రచ్చబండ వేదికగా హామీ 9ఇచ్చారు.