భారత్ వ్యూహాత్మక అడుగు..చమురు కష్టాలకు చెక్

Spread the love

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెక్యూరిటీపై చర్చ జరుగుతోంది.   ఇక  మన దేశ అవసరాలకు అవసరమైన ముడి చమురులో సుమారు 85 శాతం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఒకవేళ యుద్ధం కారణంగా సప్లై చైన్  తెగిపోతే ఏంటి పరిస్థితి అనే ఆందోళనను కలిగించాయి.  అయితే  భారత్ దీని గురించి ముందే ఆలోచన చేసింది. తన భూగర్భంలో భారీ చమురు నిల్వలను సిద్ధం చేసుకుంది. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు బయట నుంచి చమురు రాకపోయినా, కొన్ని రోజుల పాటు దేశాన్ని నడిపించేందుకు ఈ “రహస్య చమురు కోటలు” అండగా నిలవనున్నాయి. ముడిచమురును పైన నిల్వ చేయడం ప్రమాదకరం  ఖరీదైన పని. అందుకే భారత్ భూగర్భంలో భారీ గుహలను  నిర్మించింది. వీటిని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని పిలుస్తారు. విశాఖపట్నం, మంగళూరు, పడూర్ వంటి ప్రాంతాల్లో లక్షల టన్నుల చమురును నిల్వ చేసే సామర్థ్యాన్ని భారత్ ఇప్పటికే సాధించింది.  అయితే ఇక ముందు చూపుతో మోడీ సర్కార్ రెండో దశ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది.  రెండో దశ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్  పనులను వేగవంతం చేస్తోంది. ఒడిశా, కర్ణాటకలో మరో 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీలతో  కొత్త కేంద్రాలను నిర్మిస్తోంది. ఇవి పూర్తయితే, భారతదేశ నిల్వ సామర్థ్యం దాదాపు రెట్టింపు అవుతుంది. అవసరం వచ్చినప్పుడు పరిగెత్తే కంటే ముందుగానే ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిదని భావించి భారత్ ఈ భారీ పెట్టుబడులు పెడుతోంది. అదనంగా, మన దేశంలోని రిఫైనరీల వద్ద ఉండే నిల్వలను కూడా కలుపుకుంటే, సుమారు 60 నుండి 70 రోజుల పాటు దేశ అవసరాలను తీర్చుకునే కెపాసిటీ  మనకు ఉంది. ఈ నిల్వలు కేవలం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులనే కాదు  ఆర్థిక క్రమశిక్షణ కోసం కూడా. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బాగా తగ్గినప్పుడు ఉదాహరణకు కోవిడ్ సమయంలో, భారత్ భారీగా చమురును కొనుగోలు చేసి ఈ భూగర్భ గుహల్లో నింపి ఉంచుకుంది. దీనివల్ల దేశ ఖజానాకు కూడా లబ్ది చేకూరనుంది. మన దగ్గర నిల్వలు ఉంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు మనం హడావిడిగా ఎక్కువ ధరకు కొనాల్సిన అవసరం ఉండదు. ఇది దేశ ద్రవ్యోల్బణాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. భారతదేశం.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ ప్రగతి రథం ముందుకు సాగాలంటే ఇంధనం ప్రాణాధారం. అయితే, ప్రకృతి మనకు ఇచ్చిన వనరులు తక్కువ, అవసరాలు మాత్రం ఎక్కువ. గణాంకాలను పరిశీలిస్తే భారత్ ఎంతగా ఇతర దేశాలపై ఆధారపడుతుందో అర్థమవుతుంది. ఇంతటి భారీ ఆధారిత వ్యవస్థ ఉన్న దేశం, సప్లై చైన్ లో ఏ చిన్న అంతరాయం కలిగినా స్తంభించిపోవాలి. కానీ, భారత్ ఇక్కడే తన చాణక్య నీతిని ప్రదర్శించింది. ఇదే సమయంలో మన పొరుగు దేశం పాకిస్థాన్ మాత్రం ఆపసోపాలు పడుతోంది. భారత్ ముందస్తు ప్రణాళికతో నిల్వలు పెంచుకుంటే, పాకిస్థాన్ మాత్రం మినిమమ్ రిజర్వ్స్ లేక ఇబ్బందిపడుతోంది. ఇంటర్నేషనల్  మార్కెట్లో ధరలు పెరిగినా, సరఫరా తగ్గినా అక్కడ తట్టుకునే శక్తి లేదు. ఏకంగా దేశంలో లాక్‌డౌన్ ప్రకటించి, విద్యుత్ వాడకాన్ని తగ్గించి, చూడాల్సిన దుస్థితికి ఆ దేశం చేరుకుంది. భారత్ ఇంధన భద్రత విషయంలో భారత్ ‘విశ్వగురువు’గా ముందుకు సాగుతుంటే  పాకిస్థాన్ మాత్రం ఒక ‘వైఫల్యానికి’ ఉదాహరణగా నిలిచింది.

కేవలం నిల్వ కేంద్రాలను నిర్మించుకోవడమే కాకుండా, అంతర్జాతీయ దౌత్య నీతిలోనూ భారత్ తన చతురతను ప్రదర్శించింది. మన అవసరాలకు తగ్గట్టుగా వ్యూహాలు రచించింది. గతంలో ఒకటి రెండు దేశాలపైనే ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు భారత్ ఏకంగా 40 దేశాల నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల లాభం ఏమిటంటే, ఏదో ఒకటి రెండు దేశాలు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నా, సప్లై చైన్ కట్ అయినా మిగిలిన దేశాల నుంచి నిరాటంకంగా దిగుమతులు కొనసాగే ఏర్పాట్లు ఉన్నాయి. చౌకగా దొరుకుతున్న రష్యా చమురును భారీగా కొనుగోలు చేసింది. మిడిల్ ఈస్ట్ యుద్ధం మనకు ఒక హెచ్చరిక అయినప్పటికీ, భారత్ సిద్ధం చేసుకున్న ఈ వ్యూహాత్మక నిల్వలు దేశానికి కొండంత అండగా నిలుస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *