ఐపీఎల్ సీజన్ 19లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సమిష్టిగా అన్ని విభాగాల్లో రాణిస్తూ అదిరే విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై భారీ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఘోరమైన ప్రదర్శనతో తమ టీమ్ అభిమానులను నిరాశపరిచింది. 16.3 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ పోరల్ (30), డేవిడ్ మిల్లర్ (19), కైల్ జేమిసన్ (12) మాత్రమే రెండెంకెల స్కోర్ చేశారు. టాప్ ఆర్డర్ దారుణ ప్రదర్శనతో నిరాశపరిచారు. సాహిల్ పరాఖ్ (0), కే.ఎల్.రాహుల్ (0),నితీష్ రాణా (1), సమీర్ రిజ్వీ (0), స్టబ్స్ (5), అక్సర్ పటేల్ (0) ఇలా వచ్చి అలా అవుటై పెవిలియన్ చేరారు. బెంగళూరు బౌలర్లు మంచి బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. హేజల్ వుడ్ 3.3 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో సత్తా చాటాడు. రసిక్ సలామ్ ధార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6.3 ఓవర్లలోనే కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 77 పరుగులు చేసింది. దేవ్ దత్ పడిక్కల్ 34 నాటౌట్, విరాట్ కోహ్లీ 23 నాటౌట్ ఆకట్టుకున్నారు. జాకోబ్ బెథెల్ (20) పరుగులు చేశాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 7వ స్థానంలో కొనసాగుతుండగా…బెంగళూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.