
దేశంలోనే తిరుపతి నగరానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడినుంచే టీడీపీ కానీ,ప్రజారాజ్యం పార్టీ గానీ ఆవిర్భావం జరిగింది.తిరుపతి అంటే ముందు నుంచి కూడా టీడీపీకి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. తిరుపతిలో టీడీపీ గెలిస్తే, రాష్ట్రంలో ఆపార్టీ అధికారంలోకి వస్తుందనే బలమైన నమ్మకం. అందుకే అధిష్టానం కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిని సారిస్తోంది.ఇందులో భాగంగానే పార్టీ ఇంచార్జ్ నియామకంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో ఇంచార్జ్ పదవి క్రేజ్ పెరుగుతోంది. యువనేత కోసం టీడీపీ అన్వేషణ కొనసాగిస్తోంది. మరి ఇంచార్జ్ పదవి రేసులో ఎవరెవరు పోటీ పడుతున్నారు. అధిష్టానం ఎవరికి పెద్దపీట వేయనుంది.
2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం సీటును జనసేనకు కట్టబెట్టింది. దింతో కొంతమంది టీడీపీ అశావాహులు ఇష్టంగానే ఎన్నికల్లో జనసేన అభ్యర్థి గెలుపునకు కృషి చేసారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధిష్టానం సూచనల మేరకు పనిచేసిన నాయకులు, పార్టీ పదవుల కోసం ఆశావహుల సంఖ్య కూడా చాంతాడంత తయారైంది. ఎన్నికల్లో టీడీపీ ఇంచార్జ్ గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇటీవల పదవుల కేటాయింపులో స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా నియమిస్తూ, అధిష్టానం అవకాశం కల్పించింది. దింతో తిరుపతి టీడీపీ ఇంచార్జ్ పోస్ట్ ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ఈ పోస్టుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మరో వైపు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎక్కువగా జనసేన కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దింతో టీడీపీ నాయకులు వివిధ పనుల నిమిత్తం ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి అడగలేని పరిస్థితి నెలకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. దింతో టీడీపీ ఇంచార్జ్ పదవిని బలమైన నాయకుని కట్టపెడితే, పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావచ్చనే అభిప్రాయం అందరిలోనూ ఉంది.దింతో ఇంచార్జ్ పోస్ట్ కోసం నాయకులు లోలోపల పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహుల మధ్య పంచముఖ పోటీ కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తిరుపతిలో టీడీపీ అసెంబ్లీ ఇంచార్జ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా దివంగత మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి తనయుడు, మబ్బు దేవనారాయణ రెడ్డి ఒకరు.ఈయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తిరుపతిలో ఎప్పటినుంచో రాజకీయంగా ఓ బలమైన కుటుంబంగా వీరు కొనసాగుతున్నారు. పార్టీలో పెద్దతరహాగా వ్యవహరిస్తూ, అందరిని కలుకుపోయే మనస్తత్వం ఉన్నఆయనకు తిరుపతి అర్బన్ తో పాటు రూరల్ లో కూడా పెద్ద బంధువర్గమే ఉంది.అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఆయన పాత్ర కీలకమనే చెప్పాలి. సమస్యని ఎవరు వెళ్లినా,వారితో మాట్లాడి, పరిష్కరిస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా ఎక్కువగా ఉంది. ఈయనకు స్నేహితులతో పాటు బందువర్గం కూడా ఎక్కువనే చెప్పాలి. మబ్బు దేవనారాయణ రెడ్డి స్థానికుడు కావడంతో ఆయన వెంట నడిచే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.అయితే ఈయన,రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందారు.ఆతర్వాత కోట్ల కుటుంబం టీడీపీలో చేరడంతో వారితో పాటు ఈయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇదిలా ఉండగా, మొదటి నుంచి తిరుపతిలో బలిజ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆధిపత్యం కొనసాగుతోంది.అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలిజ, రెడ్డి సామాజిక వర్గాల వారే, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు.మొదటి నుంచి మబ్బు కుటుంబం,మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుటుంబంతోనే పయనిస్తోంది. అలాగే పెద్దబ్బకు యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.తిరుపతిలో మబ్బు అనేది ఓ బ్రాండ్ గా బావిస్తారనడంలో అతిశయోక్తి లేదు.ఈయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి,ఇంచార్జ్ గా వచ్చే అవకాశం ఉందనే వాదనలు ప్రజల్లో బలంగానే వినిపిస్తున్నాయి.
అదేవిధంగా జె.బి.శ్రీనివాస్ విషయానికి వస్తే, జె.బి కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే కొంత మంది యువకులు, జె.బి పేరు చెప్పి చిన్నచిన్న గొడవలు చేయడం ఆయనకు నష్టం చేకూర్చేలా ఉందనే వాదన తిరుపతి ప్రజల్లో ఉంది.అందరితో బాగా చనువుగా ఉండడం, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఈయనకు కొంత అనుకూలంగా ఉందనే మాట వినిపిస్తోంది. జె.బి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు వారి వర్గీయుల ద్వారానే తెలుస్తోంది. ఈయనకు రాజకీయాలు కొత్త కాకపొయినప్పటికి, ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం కొత్తనే చెప్పాలి.
ఇక ,పులుగోరు మురళీ కృష్ణారెడ్డి.ఈయన పేరు తిరుపతి ప్రజలకు సుపరిచితమనే చెప్పాలి. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పనిచేశారు. తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గా పోటీ చేసి గెలుపొందారు. ఆతర్వాత టీడీపీలో చేరిన ఈయన 10 సంవత్సరాలు బ్యాంక్ ఛైర్మన్ గా పనిచేశారు.మొదటి నుంచి ఈయన ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతున్నారు. వీరి కుటుంబానికి రాజకీయ అనుభవం లేకపోయినా, ఈయన మాత్రం స్వశక్తితో ప్రత్యక్ష రాజకీయాలలో రాణిస్తూ వస్తున్నారు.ప్రస్తుతం ఈయన ఇంచార్జ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక, డా.కోడూరు బాలసుబ్రహ్మణ్యం పేరు కూడా ఇంచార్జ్ రేసులో ప్రముఖంగానే వినిపిస్తోంది.ఈయన తండ్రి కోడూరు సుబ్బయ్య.వీరి కుటుంబం మొదటి నుంచి టీడీపీతోనే కొనసాగితోంది. దివంగత కోడూరు సుబ్బయ్యకి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో మంచి సంబంధాలు ఉండేవి.గత 43 సంవత్సరాలుగా, వీరు పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు.అయితే, ఇప్పటివరకు వీరు చెప్పుకోదగిన పదవిని పొందలేకపోయారు.కోడూరు బాలసుబ్రహ్మణ్యం విద్యావంతుడు. వైద్య విద్యను అభ్యసించారు. డాక్టర్ గా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు ఉంది. నగరంలోని కొన్ని ఆటో యూనియన్లకు ఈయన గౌరవ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈయన స్వతహాగా డాక్టర్ కావడంతో ఓ వైపు హాస్పిటల్ ను నడుపుతూ మరో వైపు రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఈయనకు నారా లోకేశ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి.సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా రాయలసీమ తరపున కీలకంగా కూడా పనిచేశారు.
ఇక చివరిగా,ప్రణీత్ రాయల్.ఈయన వ్యాపార వేత్తగా రాణిస్తూ,తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు.ఈయన జె.బి.శ్రీనివాస్ కి మంచి మిత్రుడు.ఈయన తిరుపతికి సమీపంలోని తిరుచానూరు వద్ద ఓ విద్యాసంస్థను నడుపుతున్నరు. ఈయనకు కూడా యూత్ లో కొంత ఫాలోయింగ్ ఉంది.వీరిది రాజకీయ కుటుంబం కాకపోయినా,వ్యాపార వేత్తగా కొనసాగుతూ, ఆర్థికంగా బలంగానే ఉన్నారు. ఈయనకు నారా రోహిత్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
తిరుపతి అసెంబ్లీ టీడీపీ ఇంచార్జ్ పదవికి పంచముఖ పోటీ ఉండడంతో అధిష్టానం, వీరి నలుగురి పేర్లతో ఆన్లైన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. టిడిపి ఇంచార్జిగా విద్యావంతుడైన యువనేతను నియమించాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి వైసీపీ సమన్వయకర్తగా, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి కొనసాగుతున్నారు. వీరిద్దరు తిరుపతి కేంద్రంగానే రాజకీయాలు కొనసాగిస్తున్నారు. రాజకీయ చుతరత ఉన్న భూమన ను ఎదుర్కోవాలంటే,టీడీపీ ఇంచార్జ్ గా సమఉజ్జి ఉన్న నేత కావాలి.ప్రజా ధారణ మెండుగా ఉన్న వ్యక్తి అయితేనే పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగలరు.ఇందులో భాగంగానే ఇంచార్జ్ ఎంపిక కోసం పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది.ఆశావహుల పేర్లతో మొబైల్ ఫోన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది.వీరిలో ఇంచార్జ్ పదవి ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి మరి.