కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి.. కార్యకర్తల త్యాగాలే పార్టీకి బలం: నాగబాబు

Spread the love

జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎన్.ఆర్.ఐ. జనసేన శ్రేణులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని, అందుకోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో అట్టడుగున ఉన్న పంచాయతీరాజ్ శాఖను పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన 18 నెలల్లోనే దేశంలోనే ప్రథమ స్థానానికి తీసుకురావడం గర్వకారణమని అన్నారు.గ్రామీణ రహదారుల కోసం రూ. 1000 కోట్లకు పైగా వెచ్చించారని, అలాగే ఐదు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపుదిద్దుకున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’ అని నామకరణం చేయడం ఆయన సంస్కారానికి నిదర్శనమని కొనియాడారు. 2024 ఎన్నికల్లో, ముఖ్యంగా పిఠాపురం గెలుపులో ఎన్.ఆర్.ఐలు పోషించిన పాత్ర మరువలేనిదని, భవిష్యత్తులోనూ ఇదే సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు.