ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఎకరాకూ నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వటమే తన టార్గెట్ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.దానికి తగినట్లుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై త్వరలోనే బ్లూ ప్రింట్ తయారు చేస్తామని శాసనసభలో తెలిపారు. సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పదిసూత్రాలను రూపొందించుకుని నీటి భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినట్లు వివరించారు. ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా నీటి భద్రత అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. రానున్న ఏడాది గోదావరి, మరుసటి ఏడాదిలో కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు. ప్రకృతిని, నదులు, నీటి వనరులను ఆరాధించే సంస్కృతి ఉన్న నేపథ్యంలో గోదావరి నదికి అఖండ హారతిని, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరులుగా భావించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని సీఎం అన్నారు. ప్రతీ ఏటా గోదావరి నది నుంచి సగటున 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అందుకే రాష్ట్రంలోని వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలోని నదులను అనుసంధానిస్తే నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని సీఎం తెలిపారు. దేశంలోనూ గంగా- కావేరి నదుల అనుసంధానం జరగాలన్నది తన బలమైన కోరికని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో గంగా- కావేరీ నదుల అనుసంధాన సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయని గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని సీఎం పునరుద్ఘాటించారు.