చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టరూపకల్పనపై ఉండవల్లిలో సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రుల బృందం సమావేశమైంది. పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంచే చట్టం రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఐజీ ఆకే రవికృష్ణ, అదిరాజ్ సింగ్ రానా ఎస్పీ సైబర్ క్రైమ్, ఐ అండ్ పీఆర్ అధికారులు, సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు చట్టం విధివిధానాలపై తమ అభిప్రాయాలను తెలిపారు.
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచితే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అనవసరమైన ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఏకాగ్రత మరియు సృజనాత్మకత మెరుగవుతుంది. స్క్రీన్ సమయం తగ్గిస్తే పిల్లలలో కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి పెరుగుతుంది. ఇది వారి ఏకాగ్రతను పెంచుతుంది. పిల్లలు స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ కు దూరంగా ఉంటే సమయానికి నిద్రపోతారు. అలాగే ఫోన్‌కు పరిమితం కాకుండా బయట ఆడుకోవడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. తోటి పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఎక్కువగా కలిసి మాట్లాడటం వల్ల భావ వ్యక్తీకరణ మరియు సామాజిక సంబంధాలు మరింత పెరుగుతాయి.