పనుల్లో జాప్యానికి వీలు లేదు..నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వం:సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల‌కు రిపేర్లు చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. నేష‌న‌ల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచ‌న‌ల మేర‌కు వీలైనంత త్వ‌ర‌గా ఈ ప‌నుల‌ను వేగవంతం చేయాల‌ని స్పష్టం చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తుల కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించి నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇక ఇందుకు  సంబంధించిన ఏజెన్సీల‌న్నింటిని అలెర్ట్  చేసి ప‌నుల్లో స్పీడ్  పెంచాల‌ని సూచించారు. సెంట్ర‌ల్ వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ రీసెర్చ్ స్టేష‌న్ ఆధ్య‌ర్యంలో జ‌రుగుతున్న‌ టెస్ట్ లు, నశాంపిల్స్ సేక‌ర‌ణను వ‌ర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. నీటిపారుద‌ల శాఖ, సీడ‌బ్ల్యూపీఆర్‌ఎస్, బ్యారేజీల నిర్మాణ సంస్థ‌లు, డిజైన్ కన్సల్టేషన్స్‌తో టీమ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.  ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజిని అధ్య‌య‌నం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో అధికారులు వివరించారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వడానికి సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్  సిద్ధం చేయాలని సీఎం పేర్కొన్నారు.  అందుకు అవసరమైన మెషినరీ ఏర్పాటు చేసుకుని వీలైనంత త్వ‌ర‌గా పని పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని తెలిపారు. డిసెంబరు వరకు చేయాల్సిన పనులపైన పూర్తి షెడ్యూల్ రెడీ చేయాలన్నారు. పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని, నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వమని చెప్పారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు మొదలయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *