మీ వాళ్ల‌కు ఒక న్యాయం, ప‌క్క వాళ్ల‌కు మ‌రో న్యాయ‌మా?: వై.ఎస్.జగన్

Spread the love

ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాఖ్య అధ్య‌క్షుడు కాక‌ర్ల వెంక‌ట్రామిరెడ్డి చేసిన త‌ప్పేంటి? ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని అడ‌గ‌డ‌మే ఆయ‌న చేసిన నేర‌మా? అని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఇటీవ‌ల ఏపీ సీఎం చంద్రబాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోందని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారని ప్ర‌తి కుటుంబాన్ని మోసం చేశారని ఆరోపించారు.  రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి ఏవీ చేయ‌క‌పోగా, సూప‌ర్ సిక్స్, అమ‌లు చేసేశామ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు కూడా చెబుతున్నారని జగన్ ఆరోపించారు.   ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి, ఉద్యోగుల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేక ప్ర‌శ్నించే గొంతుక‌ల‌పై బ్ర‌హ్మాస్త్రాలు ప్ర‌యోగిస్తున్నారని ఆరోపించారు.  ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమ‌లు చేస్తార‌ని అడిగితే అత‌నిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్ర‌యోగించి అత‌న్ని డిస్మిస్ చేశారంటే భ‌య‌ప‌డిపోతున్నార‌ని అన్నారు. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వ‌స్తూనే ఇస్తామ‌న్న ఐఆర్ ఇవ్వాలని అడ‌గ‌డంలో త‌ప్పేముంది? అని అది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే క‌దా అని గుర్తు చేశారు.  ఉద్యోగుల విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, మోస‌పూరిత వైఖ‌రిని అంద‌రూ గ‌మ‌నిస్తున్నారన్నారు. సీఐ శంక‌ర‌య్య విష‌యంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారన్నారు.  మా చిన్నాన్న వైయ‌స్ వివేకానంద‌రెడ్డి గారి హ‌త్య కేసులో జ‌ర‌గ‌ని విష‌యాల‌ను జ‌రిగిన‌ట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబ‌ద్ధాలు చెప్పార‌ని, అది త‌న‌ను బాధించింద‌ని శంక‌ర‌య్య అంటే అత‌న్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొల‌గించ‌డం మీ నిరంకుశ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? అని జగన్ ప్రశ్నించారు.   మిమ్మ‌ల్ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే వారిపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారంటే మీరు భ‌య‌ప‌డుతున్నార‌నీ క‌దా అర్థం అంటూ జగన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో రాసుకొచ్చారు. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నిక‌ల ముందు 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు, ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ.3వేల చొప్పున‌ భృతి వంటి అంశాలపై విమర్శలు గుప్పించారు. మీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ త‌ర‌ఫున క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌లేదా?  బీజేపీని ఓడించ‌మ‌ని పిలుపు ఇవ్వ‌లేదా? మ‌రి ఎందుకు అత‌న్ని డిస్మిస్  చేయ‌లేదు? అంటే మీ వాళ్ల‌కు ఒక న్యాయం, ప‌క్క వాళ్ల‌కు మ‌రో న్యాయ‌మా?  అని ప్రశ్నించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *