ఐపీఎల్ సీజన్ 19లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్థిరంగా రాణిస్తోంది. తాజాగా ఆ జట్టు మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 100 (58; 11×4, 5×6) సెంచరీతో రాణించాడు. శుభ్ మాన్ గిల్ (32), జోస్ బట్లర్ (25), జేసన్ హోల్డర్ (23 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (19 నాటౌట్) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హాజల్ వుడ్, సుయాష్ శర్మ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరు జట్టు 18.5 ఓవర్లలోనే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేజింగ్ లో అదరగొట్టే విరాట్ కోహ్లీ మరోసారి తనదైన ఆటతీరుతో సత్తా చాటాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు దేవ్ దత్ పడిక్కల్ 55 (27; 2×4, 6×6) కూడా హాఫ్ సెంచరీతో చెలరేగడంతో బెంగళూరు సునాయాసంగా లక్ష్యానికి చేరువైంది. ఆఖర్లో కృనాల్ పాండ్య 23 నాటౌట్, టిమ్ డేవిడ్ 10 నాటౌట్ బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్ లు ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.