ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్…ఇంతకీ రిలీజ్ ఎప్పుడు?

తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్‌కు తనదైన శైలిలో పంచులను, వినోదాన్ని జోడించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దిట్ట. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తే కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూవీ ఆదర్శ కుటుంబం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కుటుంబ కథాంశానికి వినోదాన్ని జోడిస్తూ త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది. సినిమాలో ఓ ప్రత్యేకమైన అతిథి పాత్ర ఉండబోతుందనే ప్రచారం వెంకీ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఆదర్శ కుటుంబం సినిమాలో కేవలం కుటుంబ కథ, వినోదమే కాకుండా, ఒక ఆసక్తికరమైన కమర్షియల్ ఎలిమెంట్‌ను కూడా త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమా కథలో అత్యంత కీలకంగా నిలిచే ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ను త్రివిక్రమ్ డిజైన్ చేశారట. ఈ పాత్ర ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లలో ప్రేక్షకులకు, ముఖ్యంగా వెంకటేష్ అభిమానులకు ఒక పర్ఫెక్ట్ థ్రిల్, కిక్ దక్కుతుందని చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఆ అతిథి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక స్టార్ హీరోనా? లేక వెంకటేష్ తో గతంలో హిట్ కొట్టిన హీరోయిన్లలో ఎవరైనా ఒకరా? అన్న అంచనాలు మొదలయ్యాయి. ఆ పాత్ర కథను ఒక కీలకమైన మలుపు తిప్పుతుందని, సినిమాకు అది కమర్షియల్‌గా పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఈ సర్ప్రైజ్ రోల్ పై చిత్రబృందం కావాలనే సీక్రెసీ మెయింటైన్ చేస్తోందని, థియేటర్లలోనే ఆ కిక్ ను ఫీల్ అవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం.



