ముఖ్య కంటెంట్‌కు వెళ్లడానికి
Mega9 TVMega9 TV📰
బ్రేకింగ్ న్యూస్

‘బ్రహ్మమొకటే’ అంటూ విదేశీ గడ్డపై తెలుగు గానం…స్విస్ చర్చిలో తెలుగు సాహిత్యానికి నీరాజనం

Mega9 TV Adminప్రచురణ: 28 నవంబర్, 2026 11:53 AMకి👁 02 నిమి చదవండి
షేర్ చేయండి:
‘బ్రహ్మమొకటే’ అంటూ విదేశీ గడ్డపై  తెలుగు గానం…స్విస్ చర్చిలో తెలుగు సాహిత్యానికి నీరాజనం
FONT SIZE

యూరప్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మక శాస్త్రీయ సంగీత ఉత్సవాల్లో స్విట్జర్లాండ్‌లో జరిగే సోల్స్‌బర్గ్ ఫెస్టివల్ ఒకటి. ఈ ఫెస్టివల్‌లో భాగంగా, రైన్‌ఫెల్డెన్‌లోని స్టాట్‌కిర్షె వేదికపై చాంటిక్లియర్ బృందం తమ అకాపెల్లా శైలిలో కచేరీ చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఈ చాంటిక్లియర్ బృందం ప్రపంచవ్యాప్తంగా అకాపెల్లా కోరల్ సంగీతంలో దిగ్గజంగా, గ్రామీ అవార్డు విజేతగా గుర్తింపు పొందింది. సాధారణంగా ఇలాంటి యూరోపియన్ సంగీత ఉత్సవాల్లో పాశ్చాత్య శాస్త్రీయ గీతాలు, రెనైసాన్స్ రొమాంటిక్ యుగాల నాటి కోరల్ సంగీతాన్ని మాత్రమే ఆలపిస్తుంటారు. కానీ ఈసారి ఆ వేదికపై 15వ శతాబ్దపు తెలుగు పదకవితా పితామహుడు అన్నమాచార్యులు రచించిన బ్రహ్మమొకటే కీర్తనను చాంటిక్లియర్ బృందం ఆలపించిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ బృందం పూర్తిగా సూట్‌–బూట్‌లో నిలబడి, ఎలాంటి వాయిద్యాలు లేకుండా కేవలం తమ గాత్రాల బృంద గానంతోనే ఆ కీర్తనకు ప్రాణం పోసింది. తెలుగు భాష అసలు రాకపోయినా, విదేశీ గాయకులందరూ తెలుగు పదాలను ఎంతో శ్రద్ధగా నేర్చుకుని, వినీల్ గరిసా మహల్‌తో కలిసి గొంతు కలపడం ఆకట్టుకుంటోంది. తాజాగా హోక్‌రైన్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రొడక్షన్స్ ద్వారా యూట్యూబ్‌లో విడుదలైన ఈ ప్రదర్శన వీడియో లక్షలాది మంది వీక్షకుల ప్రశంసలను అందుకుంటూ వైరల్ అవుతోంది.

ఇక వినీల్ గరిసా మహల్ నేపథ్యం చూసుకుంటే అమెరికాలోని టెక్సాస్‌లో పెరిగిన ఇండియన్-అమెరికన్ గాయకుడు, కంపోజర్. పాశ్చాత్య శాస్త్రీయ గానంలో ఉన్నత శిక్షణ పొందిన ఆయన, 2019లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 2022లో గ్రామీ అవార్డు విజేత అయిన ప్రఖ్యాత చాంటిక్లియర్ బృందంలో హై-టెనర్ గాయకుడిగా చేరారు. ప్రస్తుతం ఆ బృందంలో తన ఐదో సీజన్‌లో కొనసాగుతున్న వినీల్, చాంటిక్లియర్ చరిత్రలోనే భారత సంతతికి చెందిన మొట్టమొదటి గాయకుడు కావడం విశేషం. అయితే, వినీల్ కేవలం పాశ్చాత్య పాటలు పాడటంతోనే ఆగిపోలేదు. భారతీయ సంగీత సౌందర్యాన్ని పాశ్చాత్య శ్రోతలకు చేరువ చేయాలన్న గొప్ప సంకల్పంతో ఆయన కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే 2025లో చాంటిక్లియర్ బే ఏరియా కార్యక్రమంలో భాగంగా పూర్తిగా భారతీయ , ఇండియన్-అమెరికన్ సంగీతంతో కూడిన ప్రత్యేక కచేరీని ఆయన స్వయంగా రూపొందించారు. అందులో అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, ముత్తయ్య భాగవతార్ రచించిన వెస్టర్న్ నోట్ వంటి ఎన్నో భారతీయ సంగీత రచనలను అకాపెల్లా బృంద గానానికి అనుగుణంగా ఆయనే స్వయంగా అరేంజ్ చేశారు. ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో మార్మోగిన బ్రహ్మమొకటే కోరల్ అరేంజ్‌మెంట్ కూడా వినీల్ గరిసా మహల్ స్వయంగా రూపొందించినదే. వినీల్ అమెరికాలో పెరిగినప్పటికీ, చిన్నతనంలో తన తల్లిదండ్రుల కారులో ప్రయాణిస్తున్నప్పుడు అందులో నిరంతరం వినిపించే అన్నమయ్య కీర్తనలు, హిందూ భక్తి గీతాలు ఆయన మనసుపై గాఢమైన ముద్ర వేశాయి. ఆ కారు ప్రయాణాల్లో విన్న భక్తి గీతాల జ్ఞాపకాలే తనకు ఈ బ్రహ్మమొకటే ప్రదర్శనకు ప్రధాన స్ఫూర్తినిచ్చాయని వినీల్ స్వయంగా తెలిపాడు. 15వ శతాబ్దంలోనే అన్నమాచార్యులు ఈ కీర్తన ద్వారా సనాతన హిందూ ధర్మం అత్యున్నత సారాన్ని అత్యంత చక్కగా వివరించారు. ఈ అద్భుతమైన, స్ఫూర్తివంతమైన కీర్తనలు విదేశాలలో సైతం వినిపించడం భారతీయులుగా, తెలుగువారిగా హర్షించదగిన అంశం.

కామెంట్లు (0)

మీ అభిప్రాయం రాయండి

అసభ్య/స్పామ్ కామెంట్లు తొలగించబడతాయి.

సంబంధిత వార్తలు