ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీకాంత్ కూతురు.. టాప్ బ్యానర్ లో గ్రాండ్ లాంచ్

టాలీవుడ్ లో ఇప్పుడు వారసుల హవా నడుస్తోంది. స్టార్ హీరోల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం మనం చాలా ఏళ్లుగా చూస్తున్నాం. కానీ అప్పుడప్పుడూ కొందరు స్టార్ యాక్టర్స్ కూతుర్లు కూడా హీరోయిన్లుగా వచ్చి తమకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే లిస్ట్‌లో టాలీవుడ్లోకి మరో స్టార్ ఫ్యామిలీ వారసురాలు హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.టాలీవుడ్లో ఒకప్పుడు లవర్ బాయ్‌గా, ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా, ఇప్పుడు పవర్ఫుల్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అందరి మనసులు గెలుచుకున్న హీరో శ్రీకాంత్, నటి ఊహల కుమార్తె గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకంగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మొదటి సినిమా చేస్తోంది.
పెళ్లి సందడి లాంటి బ్లాక్ బస్టర్‌తో స్టార్ హీరోగా ఎదిగి, ఎన్నో ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు హీరో శ్రీకాంత్. ఆయన సతీమణి, అప్పటి స్టార్ హీరోయిన్ ఊహ కూడా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వాళ్ల పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందD , ఛాంపియన్ సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు వాళ్ల ముద్దుల కూతురు మేధ మేక వంతు వచ్చింది. నిజానికి శ్రీకాంత్ ఫ్యామిలీ అంతా సినిమాల్లోనే ఉన్నా, మేధ మాత్రం ఇన్నాళ్లూ మీడియాకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు సడెన్‌గా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటంతో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా శ్రీకాంత్ , ఊహ నటనను చూసి ఎంజాయ్ చేసిన అప్పటితరం ప్రేక్షకులు, ఇప్పుడు వాళ్ల కూతురు హీరోయిన్గా ఎలా ఆకట్టుకోబోతోందనే చర్చ టాలీవుడ్లో జోరుగా మొదలైంది.
మేధ హీరోయిన్గా లాంచ్ అవుతున్న ఈ సినిమా గురించి మేకర్స్ రీసెంట్గా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. ఈ ప్రాజెక్ట్‌కి అనిల్ ఎర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మేధ సరసన హీరోగా నటిస్తున్నది ఎవరో కాదు..రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న కుర్ర హీరో జై జాస్తి. ఈ కొత్త జంటతో, పూర్తిస్థాయి ప్రేమకథా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. దీని గురించి మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. మైత్రీ ఇన్ లవ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. తమ మనసులను గెలుచుకున్న జై జాస్తి, మేధ మేకలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం వీరి పేర్లు మాత్రమే మీకు తెలుసు.. త్వరలో తెరపై వీరి ప్రేమకథను చూసి మీరూ ప్రేమలో పడతారు అంటూ ఒక క్యూట్ క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఈ ప్రచారంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.



