త్వరలోనే నంది అవార్డులు ఆ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక పురస్కారాలుగా భావించే నంది అవార్డులను తిరిగి ఇచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ అవార్డుల సందడి నిలిచిపోవడంతో సినీ, టీవీ, నాటక రంగాల కళాకారులంతా ఎంతో నిరాశతో ఎదురుచూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక నంది అవార్డుల పండగకు రంగం సిద్ధమైంది. పెండింగ్లో ఉన్న నంది అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నంది అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీ ఛైర్మన్గా సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.
నంది అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనల మేరకు.. 2025 సంవత్సరానికి సంబంధించిన నంది అవార్డుల ఎంపిక కోసం ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక జ్యూరీ కమిటీని ప్రకటించింది. ఈ జ్యూరీ కమిటీ కూర్పును గమనిస్తే.. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల అనుభవాన్ని, ప్రతిభను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ఎంత ఆలోచనాత్మకంగా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. జ్యూరీ కమిటీ ఛైర్మన్గా ప్రముఖ కథానాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ జ్యూరీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఎస్. గోపాల్ రెడ్డిని జ్యూరీ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ఇక మహిళా కళాకారుల, సీనియర్ నటీమణుల కోణం నుంచి ప్రతిభను గుర్తించేందుకు సీనియర్ నటి ప్రభను కూడా జ్యూరీ సభ్యురాలిగా ఎంపిక చేశారు. ఈసారి కేవలం ఒక్క ఏడాది అవార్డులతోనే ప్రభుత్వం సరిపెట్టుకోవడం లేదు. గత కొన్నేళ్లుగా రకరకాల కారణాలతో నిలిచిపోయిన 2017 నుంచి 2025 వరకు ఉన్న నంది అవార్డులన్నింటినీ త్వరలోనే అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ తొమ్మిదేళ్లలో తెలుగు సినిమా రూపరేఖలే మారిపోయాయి. ప్రాంతీయ స్థాయి నుంచి పాన్ ఇండియా స్థాయికి, అక్కడి నుంచి అంతర్జాతీయ వేదికల వరకు తెలుగు సినిమా ఖ్యాతి విస్తరించింది. ఎంతోమంది కొత్త దర్శకులు, ప్రతిభావంతులైన రచయితలు, నటీనటులు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుల ప్రకటన లేకపోవడంతో, ఆ అద్భుత ప్రతిభకు తగిన అధికారిక సత్కారం దక్కలేదన్న వెలితి ఇండస్ట్రీలో ఉండేది. టెలివిజన్ రంగం, అలాగే తెలుగు సంస్కృతికి, భాషకు, అభినయానికి పునాది లాంటి నాటక రంగం కూడా ఈ నంది అవార్డుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఎప్పుడు, ఎక్కడ జరగబోతోందన్న వివరాలు సినీ ప్రియుల్లో మరింత జోష్ నింపుతున్నాయి. పెండింగ్లో ఉన్న అవార్డుల ఎంపిక ప్రక్రియను అత్యంత వేగవంతం చేసి, వచ్చే నెల అంటే డిసెంబర్లోనే నంది అవార్డుల ప్రదానోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకను విజయవాడ లేదా అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.



