తూర్పు సముద్రంలో…కిమ్ కొత్త ఆట..వణికిపోతున్న అమెరికా

ప్రపంచంలో ఏ దేశమైనా తమ ప్రజల ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి ఆలోచిస్తుంది. కానీ ఉత్తర కొరియా ఆలోచనా విధానం మాత్రం ఎప్పుడూ విధ్వంసం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా సరే, ఆ దేశ నియంత కిమ్ జంగ్ ఉన్ దృష్టి మాత్రం అణు ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణులపైనే ఉంటుంది. తాజాగా కొరియా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ.. ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ కొరియా, జపాన్‌లను, అలాగే పరోక్షంగా అమెరికాను భయపెట్టేలా.. వరుసగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. తూర్పు సముద్ర జలాల వైపు దూసుకెళ్లిన ఈ క్షిపణుల ప్రయోగం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఉత్తర కొరియా తన ఆయుధ సంపదను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. అణు సామర్థ్యం కలిగిన ఆయుధాలను సిద్ధం చేసేందుకు ఆ దేశం చాలా ఏళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా ఇవాళ తూర్పు సముద్ర జలాల వైపు పలు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ అధికారికంగా వెల్లడించింది. దక్షిణ కొరియా సంయుక్త దళాల ప్రతినిధి జాంగ్ డో యంగ్ ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి ఈ క్షిపణులను పరీక్షించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా ప్యోంగ్యాంగ్లోని ప్రధాన విమానాశ్రయాన్నే ఉత్తర కొరియా తన కీలక లాంచింగ్ సైట్‌గా వాడుకుంటోంది. ఈ ప్రయోగంలో ఒక క్షిపణి ఏకంగా 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జాంగ్ డో యంగ్ వెల్లడించారు. అయితే మొత్తం ఎన్ని క్షిపణులను రాడార్లలో డిటెక్ట్ చేశారన్న విషయాన్ని మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దక్షిణ కొరియా మిలిటరీ గోప్యంగా ఉంచింది. ఈ క్షిపణుల ప్రయోగం వల్ల అత్యంత తీవ్రంగా భయపడుతున్న మరో దేశం జపాన్. ఎందుకంటే ఉత్తర కొరియా వదిలే మిస్సైల్స్ అన్నీ వెళ్లి పడేది జపాన్ సముద్ర జలాల సమీపంలోనే. ఇప్పుడు జపాన్ అధికారులు వెల్లడించిన వివరాలు ప్రపంచాన్ని మరింత కలవరపెడుతున్నాయి. ఈ క్షిపణి ప్రయోగాలపై జపాన్ డిప్యూటీ రక్షణ మంత్రి తకాశి కోయరి స్పందించారు. కేవలం 17 నిమిషాల వ్యవధిలోనే రెండు వేర్వేరు క్షిపణులను తమ రాడార్లు డిటెక్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో తొలి క్షిపణి సుమారు 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించగా, రెండో క్షిపణి ఏకంగా 910 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన స్పష్టం చేశారు.



