పాకిస్థాన్ లో దారుణం..పట్టపగలే టీవీ యాంకర్ ఘోర హత్య! ఎవరీ రబియా ఎహ్సాన్ ..?

పాకిస్థాన్ లోని ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన 92 న్యూస్ లో పనిచేస్తున్న 41 ఏళ్ల రబియా అహ్సాన్ రావల్పిండి లోని తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. రబియా అహ్సాన్ వయసు 41 సంవత్సరాలు. పాకిస్థాన్లోని రావల్పిండిలో ఆమె తన భర్త అహ్సాన్ తాహిర్, ఇద్దరు కూతుర్లు, అలాగే తన తల్లి , చెల్లెలు అల్వీనాతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తోంది. ఆమె భర్త అహ్సాన్ తాహిర్ ఓవర్సీస్ పాకిస్థానీస్ ఫౌండేషన్ లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక భయంకరమైన కాల్పుల ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రబియా భర్త తాహిర్ ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో తాను కావాలని కాల్చలేదని, తుపాకీ క్లీన్ చేస్తుండగా లేదా పట్టుకుని ఉండగా పొరపాటున పేలిపోయిందని బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ క్రైమ్ సీన్ కు చేరుకున్న పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ అథారిటీ అధికారులు చేసిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పొరపాటున తుపాకీ పేలితే ఒక బుల్లెట్ తగులుతుంది. కానీ రబియా శరీరంలో రెండు బుల్లెట్ గాయాలను పోలీసులు గుర్తించారు. ఒక బుల్లెట్ మెడకు సరిగ్గా కింద భాగంలో దూసుకుపోగా, మరో బుల్లెట్ కుడివైపు వీపు భాగం నుంచి దూసుకెళ్లింది. అంటే అత్యంత సమీపం నుంచి కావాలనే గురిపెట్టి రెండుసార్లు కాల్పులు జరిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆ క్రైమ్ సీన్ లో ఒక పిస్టల్ తో పాటు మందుగుండు సామగ్రిని కూడా ఫోరెన్సిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఆ పిస్టల్ కు సరైన లైసెన్స్ కూడా తాహిర్ దగ్గర లేదని తేలింది. దీన్ని బట్టి ఇదొక పక్కా ప్రీ-ప్లాన్డ్ మర్డర్ అని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 కింద తాహిర్ పై హత్యానేరం కేసు నమోదు చేశారు.



