పుతిన్‌నే ఫిదా చేసిన ఈ 16 ఏళ్ల కుర్రాడు ఎవరు?

మాస్కోలో నిర్వహించిన ఏఐ జర్నీ 2026 సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలువురు యువ ఆవిష్కర్తలతో ముచ్చటించారు. కజకిస్తాన్ అధ్యక్షుడు కసిమ్-జోమార్ట్ టోకాయేవ్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో, ఏఐ రెల్మ్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు , సీటీవో అయిన పదహారేళ్ల భారతీయ యువ వ్యాపారవేత్త రాహుల్ జాన్ అజుతో పుతిన్ ప్రత్యేకంగా మాట్లాడారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్ లో అజు అభివృద్ధి చేస్తున్న స్వదేశీ సాంకేతిక పరిష్కారాల తీరును పుతిన్ మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. మీ పని ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా పిలుపును సాకారం చేస్తోంది కదా? యువత తమ సొంత పరిష్కారాలను కనుగొనడానికి మీ కృషి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ అజుకు కితాబిచ్చారు.
పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సాధారణ ప్రశంసలా కాకుండా, అంతర్జాతీయ రాజకీయ, వాణిజ్య వర్గాల్లోనూ తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే.. ఇటీవలే అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ సంస్థ, అంటే యూఎస్టీఆర్ భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. తయారీ రంగంలో భారత్ మితిమీరిన సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆరోపిస్తూ.. మేక్ ఇన్ ఇండియా , పీఎల్ఐ పథకాలు , ఆత్మనిర్భర్ భారత్ విధానాలను అమెరికా తప్పుబట్టింది. అమెరికా అలాంటి నివేదిక విడుదల చేసిన కొద్ది రోజులకే, రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మేక్ ఇన్ ఇండియా ను సమర్థిస్తూ, దానికి ఊతమిస్తున్న భారత యువ ఆవిష్కర్తను ప్రశంసించడం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది . ఇక ఏకంగా రష్యా అధ్యక్షుడి ప్రశంసలు అందుకున్న రాహుల్ జాన్ అజు నేపథ్యం తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆశ్చర్యపోతారు. కేరళకు చెందిన ఈ పదహారేళ్ల కుర్రాడిని నెటిజన్లు ముద్దుగా ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అజు ఇంజినీరింగ్ విద్యార్థి కాదు. నార్త్ ఎడపల్లి పాఠశాలలో కామర్స్ చదువుతూనే తన అపారమైన ఆసక్తితో ఏఐ రంగంలోకి అడుగుపెట్టాడు. కేవలం తొమ్మిదేళ్ల చిన్న వయసు నుంచే సాంకేతికతపై మక్కువ పెంచుకున్న అజు, ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా నేర్చుకుంటూ ఎదిగాడు. ఇప్పటికే థింక్క్రాఫ్ట్, రెస్క్యూ ఏఐ , మీబాట్ వంటి అధునాతన ఏఐ సాధనాలను రూపొందించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కేవలం తాను ఎదగడమే కాదు, తన జ్ఞానాన్ని అందరికీ పంచాలనే లక్ష్యంతో అజు పనిచేస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం అస్సలు లేని సామాన్యులకు కూడా కృత్రిమ మేధను చేరువ చేయడమే లక్ష్యంగా ఆయన అనేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాడు. థింక్క్రాఫ్ట్ అకాడమీ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఈ చిన్న వయసులోనే ఇప్పటివరకు ఎనిమిది టెడెక్స్ ప్రసంగాలు ఇవ్వడం విశేషం. అంతేకాదు, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోనూ ప్రత్యేక సెషన్లు నిర్వహించి అందరినీ అబ్బురపరిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాహుల్ జాన్ అజుకు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు . మొత్తం మీద కామర్స్ చదువుతూనే ఏఐ కంపెనీ స్థాపించి, అంతర్జాతీయ వేదికపై రష్యా అధ్యక్షుడు పుతిన్ చేత మేక్ ఇన్ ఇండియా గురించి ప్రశంసలు అందుకున్న పదహారేళ్ల రాహుల్ జాన్ అజు.. నేటి భారత యువత శక్తిసామర్థ్యాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.



