భారత్ కు హ్యాండ్ ఇచ్చిన బంగ్లాదేశ్ సీన్ లోకొచ్చిన చైనా..ఆ సరిహద్దుల్లో అసలేం జరుగుతోంది..?
కామెంట్లు (0)

ఇన్నాళ్లూ పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవుల ద్వారా భారత్ ను చుట్టుముట్టాలని చూసిన డ్రాగన్ కంట్రీ చైనా.. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కన్నేసింది. మన భారతదేశ సరిహద్దుకు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో చైనా తన భారీ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్‌లోని కీలకమైన మోంగ్లా ఓడరేవు డెవలప్మెంట్ కోసం చైనా ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ పోర్ట్ తర్వాత రెండవ అతిపెద్ద ఓడరేవు ఈ మోంగ్లా పోర్ట్. ఈ ఓడరేవు విస్తరణ, అలాగే ఆధునికీకరణ కోసం బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాతో చేతులు కలిపింది. దీనికోసం చైనా 35.78 మిలియన్ డాలర్ల రుణాన్ని, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 341 కోట్ల రూపాయలను బంగ్లాదేశ్‌కు అప్పుగా ఇస్తోంది. అక్టోబర్ 10న వీళ్ల మధ్య సీక్రెట్‌గా ఈ డీల్ కుదరగా, అక్టోబర్ 12న దీనిని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. చైనా ఎగ్జిమ్ బ్యాంక్ కేవలం 2 శాతం వడ్డీతో ఈ రుణాన్ని అందిస్తోంది. దీనికి ఐదేళ్ల గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద రెండు కొత్త కంటైనర్ టెర్మినల్స్, భారీ కంటైనర్ల నిల్వ ప్రాంగణం, సరుకుల పంపిణీ యార్డ్, అలాగే సరుకులను ఫాస్ట్‌గా లోడ్ , అన్లోడ్ చేయడానికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలను చైనా కంపెనీలు నిర్మించబోతున్నాయి. నదీ మార్గం ద్వారా బంగాళాఖాతానికి డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యే ఈ మోంగ్లా ఓడరేవు డెవలప్ అయితే.. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ వాణిజ్యం భారీగా పెరుగుతుందని ఆ దేశం లెక్కలు వేసుకుంటోంది.
ఈ పోర్ట్ డెవలప్ చేసుకుంటే బంగ్లాదేశ్‌కు మంచిదే అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ ఒప్పందానికి ముందు బంగ్లాదేశ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఇండియాను అలర్ట్ చేసింది. ఈ మోంగ్లా పోర్ట్ సమీపంలోనే గతంలో భారత్‌కు బంగ్లాదేశ్ కొంత భూమిని కేటాయించింది. అక్కడ ఇండియా ఒక భారీ సెజ్ డెవలప్ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్‌ను బంగ్లాదేశ్ సడెన్‌గా రద్దు చేసింది. ఇండియా ఒప్పందం ప్రకారం నిర్ణీత టైమ్‌లో అక్కడ భౌతిక నిర్మాణ పనులు ప్రారంభించలేదని, అందుకే ఆ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేస్తున్నామని బంగ్లాదేశ్ అధికారులు ఒక రీజన్ చెప్పారు. ఒకవైపు భారత్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం, ఆ వెంటనే ఇప్పుడు మోంగ్లా పోర్ట్ డెవలప్మెంట్ కోసం చైనా భారీ లోన్ ఇవ్వడం ఒకేసారి జరిగాయి. అయితే ఇండియా ప్రాజెక్ట్‌కు ప్రత్యామ్నాయంగానే చైనా ఈ లోన్ ఇస్తోందని డైరెక్ట్‌గా చెప్పడానికి ఆధారాలు లేకపోయినా.. టైమింగ్ మాత్రం ఇండియాకు చాలా డౌట్స్ క్రియేట్ చేస్తోంది. బంగ్లాదేశ్ పాలిటిక్స్‌లో వచ్చిన మార్పుల తర్వాత.. వాళ్లు ఇండియాను పక్కనపెట్టి చైనా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్న వాదనలకు ఈ డీల్ బలం చేకూరుస్తోంది.



