విజయ్ సేతుపతి ‘మహారాజ’కు హాలీవుడ్ స్టార్ ఫిదా!

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న సినిమా ‘మహారాజ’ . ఇప్పుడు ఈ సినిమా ఏకంగా హాలీవుడ్ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా, ఆయన కెరీర్లోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచిపోయింది. విడుదలైన సమయంలోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు సినీ ప్రముఖులు, ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ హ్యాంక్స్ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలోని ఒక పాత్ర గురించి మాట్లాడుతూ..ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు కవితా గుప్తా స్వయంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక ఎమ్మీ అవార్డుల వేడుకలో విజయ్ సేతుపతిని కలిసిన ఆమె, టామ్ హ్యాంక్స్తో తనకు జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ ఆ వివరాలను పంచుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఒక ఎల్ఏసీఎంఏ గాలా కార్యక్రమంలో ఆమె టామ్ హ్యాంక్స్తో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయనతో కాసేపు ముచ్చటిస్తుండగా, చూసేందుకు ఏవైనా మూడు మంచి భారతీయ చిత్రాలను సూచించమని టామ్ హ్యాంక్స్ ఆమెను అడిగారట. దాంతో కవితా గుప్తా ఆయనకు మహారాజ సినిమాను తప్పకుండా చూడమని సూచించారు.ఆ తర్వాత కొన్ని వారాలకు మరో కార్యక్రమంలో టామ్ హ్యాంక్స్ మళ్లీ ఆమెకు తారసపడ్డారు. అయితే ఈసారి కవితా గుప్తా అడగకముందే, టామ్ హ్యాంక్స్ స్వయంగా మహారాజ సినిమా గురించి ప్రస్తావించి ప్రశంసల వర్షం కురిపించారట. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూతురిగా నటించిన చిన్నారి సచన అద్భుత నటనను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆ అమ్మాయి నటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. చాలా అద్భుతంగా నటించింది. నేను ఆ పాత్ర చేసి ఉంటే ఆ వ్యక్తిని చంపేసేవాడినేమో అని టామ్ హ్యాంక్స్ తనతో చెప్పారని కవితా గుప్తా వెల్లడించారు. నిజానికి మహారాజ చిత్రంలో విజయ్ సేతుపతి కూతురి పాత్రలో కనిపించిన చిన్నారి సచనా నామిదాస్ తన సహజ నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఆ అద్భుత అభినయానికి గుర్తింపుగా, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఆమెకు ఉత్తమ సహాయ నటి పురస్కారం సైతం దక్కింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, నటరాజ్ సుబ్రమణ్యం తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు.



