సౌదీకి హౌతీల డెడ్లీ వార్నింగ్
సౌదీ ఎయిర్‌పోర్ట్‌లపై జరుగుతున్న ఈ వరుస దాడుల వెనుక ఉన్నది హౌతీ తిరుగుబాటుదారులు. యెమెన్‌కు చెందిన ఈ సాయుధ సంస్థ తాజాగా ఈ దాడులకు తామే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

గల్ఫ్ దేశాల్లో అత్యంత సురక్షితమైన, సంపన్న దేశంగా పేరున్న సౌదీ అరేబియా ఇప్పుడు తీవ్రమైన అభద్రతా భావంతో వణికిపోతోంది. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు నేరుగా సౌదీ అరేబియాను కమ్మేస్తున్నాయి. పౌర విమానయాన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా జరుగుతున్న హౌతీల దాడులు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వరుస దాడులు ఈ ఆందోళనకు ప్రధాన కారణం. రియాద్ మాత్రమే కాకుండా తూర్పు ప్రావిన్స్‌లోని దమ్మామ్ కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా దుండగులు టార్గెట్ చేయడం సౌదీ ఆయువుపట్టును దెబ్బకొట్టినట్టయింది. అంతే కాదు...ఏకంగా హైతీల సైనిక ప్రతినిధి రంగంలోకి దిగి సౌదీ ఏ మాత్రం సురక్షితం కాదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
సౌదీ ఎయిర్‌పోర్ట్‌లపై జరుగుతున్న ఈ వరుస దాడుల వెనుక ఉన్నది హౌతీ తిరుగుబాటుదారులు. యెమెన్‌కు చెందిన ఈ సాయుధ సంస్థ తాజాగా ఈ దాడులకు తామే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి హౌతీ సైనిక ప్రతినిధి సంచలన వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన సౌదీ అరేబియాకు ఒక స్పష్టమైన, కఠినమైన వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలు ఇకపై ఎంత మాత్రం కూడా సురక్షితం కావు. విమానయాన సంస్థలు, ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ప్రాణాలు దక్కించుకోవాలంటే.. తక్షణమే సౌదీ వైమానిక కేంద్రాలకు దూరంగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు. అయితే, ముస్లింల పవిత్ర నగరాలైన మక్కా, మదీనా విమానాశ్రయాలను మినహాయించి, మిగతా ఏ ఒక్క ఎయిర్ పోర్ట్ కూడా సేఫ్ కాదని ఆయన తేల్చి చెప్పారు. యెమెన్‌లో సౌదీ అరేబియా తన సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయకపోతే.. రాబోయే రోజుల్లో ఈ దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హౌతీలు అల్టిమేటం జారీ చేశారు.
సౌదీ అరేబియాలో సుమారు 25 లక్షల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో లక్షలాది మంది తెలుగు వారు కూడా ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లు సేఫ్ కాదని హౌతీలు చెప్పడంతో, ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తమ పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక సేఫ్టీ అడ్వైజరీ ని జారీ చేసింది. ప్రస్తుత భద్రతా వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని, సౌదీలో ఉన్న భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ముఖ్యంగా అనవసరమైన ప్రయాణాలను వెంటనే వాయిదా వేసుకోవాలని ఎంబసీ స్పష్టం చేసింది. స్థానిక సౌదీ అధికారులు ఎప్పటికప్పుడు విడుదల చేసే భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, లేదా సహాయం అవసరమైతే వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారతీయులు సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్: 00-966-11-4884697. అలాగే ఈ-మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఈ-మెయిల్ ఐడీ: community.riyadh@mea.gov.in. ప్రతి ప్రవాస భారతీయుడు ఈ వివరాలను తమ వద్ద ఉంచుకోవాలని అధికారులు కోరారు.
కేవలం భారత్ మాత్రమే కాదు.. అమెరికా, అలాగే బ్రిటన్ కూడా తమ దేశ పౌరుల కోసం అత్యంత కఠినమైన ప్రయాణ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ తమ దౌత్య సిబ్బంది ప్రయాణాలపై బ్యాన్ విధించింది. ముఖ్యంగా యెమెన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల పరిధిలో అమెరికన్ పౌరులు గానీ, అధికారులు గానీ ప్రయాణించడాన్ని పూర్తిగా నిషేధించింది. సౌదీలోని కీలక నగరాలైన జిజాన్, అసీర్, నజ్రాన్, ఖతీఫ్, యంబూ, తాయిఫ్ నగరాలకు వెళ్లాలంటే అమెరికా అధికారులకు ప్రత్యేక ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. మరోవైపు బ్రిటన్ ఏకంగా తమ పౌరులను ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది. సౌదీ అరేబియాను వీడి స్వదేశానికి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే బ్రిటన్ పౌరులు.. సౌదీ విమానాశ్రయాలను కాకుండా రోడ్డు మార్గాలను వినియోగించుకోవాలని కోరింది. రోడ్డు మార్గం ద్వారా పొరుగు దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , లేదా జోర్డాన్ దేశాలకు చేరుకుని, అక్కడి నుంచి విమాన సర్వీసులను ఉపయోగించుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని బ్రిటన్ విదేశాంగ శాఖ సూచించింది.
సౌదీ అరేబియా విమానాశ్రయాలపై దాడులు జరగడం అంటే.. అది కేవలం ఆ దేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన సౌదీపై దాడులు జరిగితే గ్లోబల్ ఎకానమీ, చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక హౌతీల వెనుక ఇరాన్ మద్దతు ఉందన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ వివాదం మరింత పెద్దదయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతానికి సౌదీ అరేబియాలో ఉన్న మన తెలుగువారు, ఇతర భారతీయులు అనవసర ప్రయాణాలు మానుకుని, ఎంబసీ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని కోరుకుందాం. మారుతున్న పరిణామాలపై భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.



