హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా ఎఫ్-16 జెట్‌పై మిస్సైల్ ఎటాక్?

అమెరికా, ఇరాన్ మధ్య మరో సంచలన సైనిక వివాదం తెరపైకి వచ్చింది. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి గగనతలంలో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానంపై తాము క్షిపణి దాడి చేశామని ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 21 శనివారం నాడు ఇరాన్ సైన్యం , అక్కడి ప్రభుత్వ మీడియా ఒక సంచలన వార్తను బయటపెట్టాయి. నవంబర్ 20న పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి మీదుగా ఎగురుతున్న అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను తమ స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గుర్తించాయని ఇరాన్ పేర్కొంది. వెంటనే తమ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణిని ప్రయోగించాయని తెలిపింది. ఆ క్షిపణి ఎఫ్-16 విమానానికి అత్యంత సమీపంలో పేలడంతో విమానం దెబ్బతిందని ఇరాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఫలితంగా పైలట్ తన ఆపరేషన్‌ను రద్దు చేసుకుని, సమీపంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందని ఇరాన్ సైన్యం వాదించింది. ఫ్లైట్-ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ వెలువడిన కొన్ని నివేదికల ప్రకారం.. ఆ ఎఫ్-16 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమీపంలో అత్యవసర పరిస్థితిని సూచించే కోడ్ 7700 ను పంపి, వేగంగా కిందకు దిగి అబుదాబిలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయినట్లు ఇరాన్ మీడియా ప్రచారం చేసింది. దీనికి బలం చేకూర్చేలా, ఒక విమానం వైపు క్షిపణి దూసుకెళ్తున్నట్లు కనిపిస్తున్న వీడియోను కూడా ఇరాన్ సైన్యం విడుదల చేసింది. అయితే ఆ వీడియో నిజానిజాలను ఇప్పటివరకు ఏ స్వతంత్ర సంస్థా ధృవీకరించలేదు. ఇక మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే యూఎస్ సెంట్రల్ కమాండ్ అంటే సెంట్కామ్ శనివారం నాడు సోషల్ మీడియా వేదిక లో ఇరాన్ వాదనకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.



