అటు శర్మ..ఇటు వర్మ…ఇక ఇండియన్ క్రికెట్ కు ‘వైభవ’మే

భారత క్రికెట్ చరిత్ర ఎప్పుడూ ఒక అద్భుతమైన నవల లాంటిది. ఒక తరం ముగుస్తోంది అనగానే, ఏమాత్రం భయం కలగకుండా మరో కొత్త తరం దూసుకొచ్చి ఆ బాధ్యతలను తమ భుజాలపై వేసుకుంటుంది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కాలం నుంచి.. సచిన్, గంగూలీ, సెహ్వాగ్ శకం.. ఆ తర్వాత ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మల వరకు మన క్రికెట్‌కు ఎప్పుడూ లోటు లేదు. అయితే రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజాలు టీ20ల నుంచి తప్పుకున్న తర్వాత భారత క్రికెట్ భవిష్యత్తు ఏంటి? ఆ ఖాళీని భర్తీ చేసేది ఎవరు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు ముగ్గురు కుర్రాళ్లు తమ బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నారు. అటు శర్మ.. ఇటు వర్మ.. మధ్యలో వైభవం.. వినడానికి ఏదో సినిమా డైలాగ్‌లా ఉన్నా, ఇదే ఇప్పుడు టీమిండియా వాస్తవం. పంజాబ్ పవర్ హిట్టర్ అభిషేక్ శర్మ, హైదరాబాద్ సొగసైన ఆటగాడు తిలక్ వర్మ, బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఈ ముగ్గురూ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు.
ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్, చిన్నప్పటి నుంచే క్రికెట్ వాతావరణంలో పెరిగాడు. అతని తండ్రి రాజ్‌కుమార్ శర్మ స్వయంగా క్రికెట్ కోచ్ కావడంతో, బడికి వెళ్లాల్సిన వయసులోనే బ్యాట్ పట్టి గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. చిన్నతనంలోనే తన సహచరుడు శుభ్‌మన్ గిల్‌తో కలిసి అండర్-14 క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. 2018లో పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్ ప్రమాదంలో పడుతోందని భయపడుతున్న సమయంలో, కరోనా లాక్డౌన్ అతనికి ఒక వరంలా మారింది. ఆ సమయంలో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ దగ్గర కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. బ్యాట్ స్వింగ్, ఫుట్ వర్క్ పూర్తిగా మార్చుకున్నాడు. రోజూ గంటల తరబడి సిక్సర్లు కొట్టడమే ప్రాక్టీస్ చేశాడు. ఆ కష్టమే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున, భారత జట్టు తరఫున విధ్వంసకర ఓపెనర్‌గా మార్చింది. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేయడం అభిషేక్ శైలి. రాబోయే వరల్డ్ కప్‌లో పవర్‌ప్లేలో బౌలర్లను భయపెట్టగల ఏకైక ఆయుధం అభిషేక్. తక్కువ ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. దానికి తోడు అతని లెఫ్ట్-ఆర్మ్ స్పిన్ జట్టుకు ఒక అదనపు బౌలింగ్ ఆప్షన్‌ను ఇస్తుంది.



