అర్నబ్ తుపాను ఎఫెక్ట్..రైతులకు భారీ నష్టపరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికించిన అర్నబ్ తుపాను ధాటికి వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంట.. చేతికొచ్చే సమయానికి రాక్షస తుపాన్ బారిన పడి నేలపాలైతే ఆ రైతు పడే ఆవేదన వర్ణనాతీతం. ఆకాశం వైపు చూస్తూ కన్నీరు పెట్టుకున్న రైతన్నలను చూసి యావత్ రాష్ట్రం చలించిపోయింది. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కన్నీరుమున్నీరవుతున్న రైతులకు నేనున్నాను అంటూ ఏపీ సర్కార్ భరోసా కల్పించింది. అర్నబ్ తుపాన్ సృష్టించిన బీభత్సంపై క్షేత్రస్థాయిలో పూర్తి సర్వే నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక భారీ నష్టపరిహారం ప్యాకేజీని అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయ పంటల నుంచి ఉద్యానవన తోటల వరకు ఏయే పంటలకు ఎంత పరిహారం ఇస్తారో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ ఒక్క తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2 లక్షల 24వేల హెక్టార్లలో వ్యవసాయ , ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు నీట మునిగాయి, చేతికొచ్చిన పత్తి నేలరాలింది, భారీ ఈదురు గాలులకు అరటి, బొప్పాయి తోటలు మొదళ్లతో సహా విరిగిపోయాయి. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో ఈ అర్నబ్ తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి , గోధుమ పంటలకు హెక్టారుకు ఏకంగా 25 వేల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పత్తి రైతులకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ సాయం వారికి కొంతవరకు ఊరటనిస్తుంది. ఇక రాష్ట్రానికి అన్నం పెట్టే వరి పంట విషయానికి వస్తే, నీట మునిగిన వరి పంటలకు హెక్టారుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే మరో కీలక వాణిజ్య పంట అయిన చెరుకు తోటలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో, వీరికి కూడా హెక్టారుకు 25 వేల రూపాయల పరిహారాన్ని అందిస్తారు. వీటితో పాటు మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా పండించే సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు 15 వేల రూపాయల సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.



