అమెరికా చేతిలో అదిరిపోయే వెపన్..ఇరాన్ భూగర్భ బంకర్లు బద్దలవుతాయా?
కామెంట్లు (0)

మిడిల్ ఈస్ట్ నెలలుగా ఉద్రిక్తకరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ అణు కార్యక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి, ఆ దేశాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేయడానికి అమెరికా ఒక భయంకరమైన స్కెచ్ గీసింది. ఆ స్కెచ్ పేరు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ . పేరుకు తగ్గట్టుగానే ఇది బాంబులకే అమ్మ లాంటిది. సుమారు 10 టన్నుల బరువుండే ఈ మహా విధ్వంసక ఆయుధాన్ని ఇరాన్ అణు కేంద్రాలపై ప్రయోగించడానికి అమెరికా సైన్యం రంగం సిద్ధం చేసినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బాంబు పేల్చింది. అసలు అమెరికా ప్రయోగించాలనుకుంటున్న ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ గురించి ముందుగా తెలుసుకుందాం. దీని టెక్నికల్ పేరు GBU 43/B. ఇది నూక్లియర్ వెపన్ కాదు, ఒక సంప్రదాయ బాంబు మాత్రమే. కానీ, ఇది పేలినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మాత్రం ఒక చిన్న సైజు అణుబాంబుతో సమానంగా ఉంటుంది. దీని బరువు అక్షరాలా 9,800 కిలోలు. దీన్ని మామూలు ఫైటర్ జెట్స్ మోసుకెళ్లలేవు, భారీ కార్గో విమానాలైన సీ-130 హెర్క్యూలిస్ ద్వారా మాత్రమే దీన్ని ప్రయోగిస్తారు.
ఈ బాంబు నేలను తాకక ముందే గాల్లోనే పేలుతుంది. అది పేలినప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేసుకుని ఒక భయంకరమైన షాక్ వేవ్ ను క్రియేట్ చేస్తుంది. ఆ దెబ్బకు భూమి లోపల ఉన్న బంకర్లు, గుహలు, సొరంగాలు పేకమేడల్లా కుప్పకూలిపోతాయి. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌లో దాక్కున్న ఐసిస్ ఉగ్రవాదుల సొరంగాలను నాశనం చేయడానికి అమెరికా ఈ బాంబును ప్రయోగించినప్పుడు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ఇప్పుడు అదే బాంబును ఇరాన్ మీద ప్రయోగించడానికి అమెరికా సైన్యం ఆప్షన్స్‌ను పరిశీలిస్తోంది.
బాంబు పవర్ బాగానే ఉంది.. కానీ టార్గెట్ ఇరాన్ అయినప్పుడు లెక్కలు వేరేలా ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ గనక ఆదేశిస్తే ఇరాన్‌లోని ఇంధన కేంద్రాలు, ముఖ్యంగా పిక్‌యాక్స్ మౌంటైన్ లాంటి అణు కేంద్రాలపై దాడులు చేయడానికి పెంటగాన్ రెడీగా ఉంది. కానీ అమెరికా అధికారులకు ఇక్కడే ఒక పెద్ద అనుమానం, ఆందోళన పట్టుకుంది. ఇరాన్ ప్రభుత్వం అమెరికా దాడుల నుంచి తమ న్యూక్లియర్ ప్లాంట్స్ ను కాపాడుకోవడానికి.. పర్వతాల కింద, అత్యంత కఠినమైన గ్రానైట్ రాతి పొరల కింద వందల మీటర్ల లోతులో అణు కేంద్రాలను నిర్మించింది. మరి ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. ఆ కఠినమైన గ్రానైట్ పొరలను ఛేదించుకుని వెళ్లి భూగర్భ కేంద్రాలను ఎంతవరకు నాశనం చేయగలదనే సందేహం అమెరికా సైన్యాధికారుల్లోనే వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఈ బాంబు భారీ పేలుడు పరిధి వల్ల ఇరాన్ పౌరులకు భారీ ఎత్తున ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ పౌరులు వేలాది మంది చనిపోతే ప్రపంచ దేశాల ముందు అమెరికా దోషిగా నిలబడాల్సి వస్తుంది. పైగా ఇరాన్ కూడా సైలెంట్‌గా ఊరుకోదు, మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌ల మీద ప్రతిదాడులు మొదలుపెడుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ పక్కాగా బేరీజు వేసుకునే పనిలో ఉంది అమెరికా సైన్యం. మరి ఇంత రిస్క్ ఉన్నా ట్రంప్ ప్రభుత్వం ఎందుకు ఈ అటాక్ ప్లాన్‌ను సీరియస్‌గా పరిశీలిస్తోంది? ఇక్కడే అసలైన పాలిటిక్స్ ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఇరాన్‌తో ఏళ్లుగా నడుస్తున్న ఈ టెన్షన్స్‌కి ఒక ఎండ్‌కార్డ్ వేసి, తాము ఇరాన్‌ను ఓడించామని, అమెరికా భద్రతను కాపాడామని తమ ప్రజలకు చూపించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఒక కచ్చితమైన విజయం సాధించినట్లు చూపించుకునే ప్రత్యామ్నాయాలను వైట్‌హౌస్ వెతుకుతోంది. ముఖ్యంగా అమెరికాలో జరగబోయే మధ్యంతర ఎన్నికలకు ముందుకానీ, లేదా తర్వాత కానీ ఈ సైనిక చర్యలు చేపట్టాలనే యోచనలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీస్తే, ఆ క్రెడిట్ మొత్తం అధికార పార్టీకి దక్కుతుంది, తద్వారా ఎన్నికల్లో భారీ లబ్ధి చేకూరుతుందన్నది రాజకీయ వ్యూహకర్తల ప్లాన్ కావచ్చు. అయితే ఇరాన్‌పై కొత్త దాడులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటివరకు పెంటగాన్ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. ఇదంతా అమెరికా ఆడుతున్న ఒక మైండ్ గేమ్ కావొచ్చు అని కూడా కొందరు దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.



