ఇండస్ట్రీలో పాలిటిక్స్..నటి ఆనంది ఎమోషనల్ స్పీచ్
కామెంట్లు (0)

తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది. తాజాగా గరివిడి లక్ష్మి మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్స్ లోకి రానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో టాలీవుడ్లో ఉన్న పాలిటిక్స్‌పై ఆనంది సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లో ఎన్నో లెక్కలు, రాజకీయాలు ఉంటాయని, కొన్నిసార్లు తాను ఈ రంగానికి సరిపోనేమో అనిపిస్తుందని ఎమోషనల్ అయ్యింది. తనకు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమ, మద్దతు గురించి మాట్లాడుతూనే వేదికపైనే ఏడ్చేసింది.
మారుతి డైరెక్ట్ చేసిన బస్ స్టాప్ సినిమాతో రక్షితగా పరిచయమై, ఆ తర్వాత ఆనందిగా పేరు మార్చుకుని జాంబీ రెడ్డి , శ్రీదేవి సోడా సెంటర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది తెలుగమ్మాయి ఆనంది. తాజాగా తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ అండ్ ఎమోషనల్ మూవీ గరివిడి లక్ష్మి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేదికపై మాట్లాడటానికి మైక్ అందుకున్న ఆనంది.. తన ప్రయాణాన్ని, ఇండస్ట్రీలో తాను పడుతున్న స్ట్రగుల్‌ను తలచుకుని కన్నీటి పర్యంతమైంది. నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లకు పైనే అవుతోంది. ఎన్నో మంచి పాత్రలు చేశాను, నటిగా నన్ను నేను నిరూపించుకున్నాను. అయినా సరే, ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి. మనకు టాలెంట్ ఉన్నంత మాత్రాన ఇక్కడ అవకాశాలు రావు. మనకు తెలియకుండానే మన చేతికి వచ్చిన ప్రాజెక్టులు వేరేవాళ్ల చేతికి వెళ్లిపోతాయి. అలాంటి రాజకీయాలు నేను చాలా ఫేస్ చేశాను అంటూ ఎమోషనల్ అయ్యింది. తనకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరని, కేవలం తన టాలెంట్‌ను నమ్ముకునే తాను ఇక్కడి దాకా వచ్చానని చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. గరివిడి లక్ష్మి లాంటి కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా నాకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపింది.



