ఎల్ నినో ప్రభావం.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

ఎల్ నినో ప్రస్తుతం వాతావరణంపై దీని ప్రభావాన్ని చూస్తూనే ఉన్నాం. అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అంటే పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కడం వల్ల ఇది సంభవిస్తుంది. భారత్ వంటి ఉష్ణమండల దేశాలలో ఎల్ నినో ప్రధానంగా రుతుపవనాలను బలహీనపరుస్తుంది. దీని ఫలితంగా వర్షపాతం తగ్గడం కూడా చూశాం. అధిక ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన వేడిగాలులు ప్రభావం చూపిస్తున్నాయి. వాతావరణంలో జరిగే ఈ ఆకస్మిక మార్పులు మానవ శరీరంపై మరియు జీవనశైలిపై నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనేది చూద్దాం.
వేడి మరియు తేమ శాతంలో వ్యత్యాసాల వల్ల మనుషులలో డీహైడ్రేషన్ (నీటిశాతం తగ్గడం), హీట్ స్ట్రోక్ (వడదెబ్బ), శ్వాసకోశ సమస్యలు మరియు చర్మ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడం వల్ల మానసిక ఒత్తిడి, నిద్రలేమి, తీవ్రమైన అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు దోమలు మరియు కలుషిత నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల (డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్) ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.
ఎల్ నినో వల్ల ఉత్పన్నమయ్యే తీవ్రమైన వేడి ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణులు, గుండె మరియు శ్వాసకోశ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వీటితో పాటు రోజంతా ఎండలో కష్టపడి పనిచేసే శ్రమజీవులు, శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వేడి తీవ్రతకు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
క్షేత్రస్థాయిలో, ఎండలో పనిచేసే కార్మికులు, డెలివరీ బాయ్స్, వ్యాపారులు వడదెబ్బ తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రతి అర్ధగంటకోసారి నీరు తాగడం, సూర్యరశ్మి నేరుగా పడకుండా పల్చటి కాటన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవడం, మరియు ఉప్పు-చక్కెర మిశ్రమం లేదా ORS తాగడం ద్వారా డీహైడ్రేషన్ నుండి రక్షణ పొందవచ్చు. రోజంతా ఏసీ గదుల్లో పనిచేసే వారు కూడా ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉండేలా చూసుకోవాలి. బయటి ఎండ నుండి రాగానే నేరుగా ఏసీ గదిలోకి వెళ్లడం లేదా ఏసీ నుండి వెంటనే తీవ్రమైన ఎండలోకి వెళ్లడం చేయకూడదు. అలాగే ఏసీలో ఉన్నప్పటికీ తగినంత నీరు తాగడం మరచిపోకూడదు.
