ఒకవైపు ఇరాన్..మరోవైపు హౌతీలు..భారత్‌కు పొంచి ఉన్న అతి పెద్ద గండం!

ఒకవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు, మరోవైపు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల విధ్వంసం..వెరసి ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఇప్పుడు నెలకున్న యుద్ధ వాతావరణం కేవలం ఆయా దేశాలకే పరిమితం కాలేదు. ఇది నేరుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుడి జీవనాన్ని టార్గెట్ చేస్తోంది. భారతదేశానికి ,క్రూడ్ ఆయిల్‌కు ఉన్న సంబంధం ప్రాణవాయువు లాంటిది. మన దేశానికి కావాల్సిన మొత్తం చమురులో దాదాపు 85 శాతం మనం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇరాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు పెరిగితే.. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ సప్లై ఆగిపోతుంది. సప్లై తగ్గగానే ఆటోమేటిక్‌గా ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటాయి. ఆయిల్ రేటు పెరిగితే ఏమవుతుంది? మనం దిగుమతి చేసుకునే చమురుకు ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్న డాలర్ల రిజర్వులు కరిగిపోతాయి. డాలర్‌కు డిమాండ్ పెరిగి, మన రూపాయి విలువ అమాంతం పడిపోతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎంత పతనమైతే, మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అంతలా పెరుగుతాయి. ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు పెరగడం వల్ల కూరగాయల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. అంటే, ఆయిల్ షాక్ అనేది కేవలం పెట్రోల్ బంక్‌లకే పరిమితం కాదు, ప్రతి ఇంట్లోని వంటింటికి సెగ తాకుతుంది. ప్రస్తుతం రూపాయి కాస్త నిలదొక్కుకుంటున్నట్లు కనిపిస్తున్నా, మిడిల్ ఈస్ట్‌లో ఒక్క పెద్ద దాడి జరిగినా మళ్లీ ఆయిల్ షాక్ ఖాయం.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే.. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసే ప్రమాదం ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతానికి పైగా ఈ చిన్న మార్గం గుండానే జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు హాహాకారాలు మొదలవుతాయి. ఇండియాకు వచ్చే చమురు కూడా అక్కడినుంచే రావాలి. రెండవది హౌతీలు. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆసియా, యూరప్ మధ్య జరిగే వ్యాపారానికి ఎర్ర సముద్రమే ప్రధాన మార్గం. ఇండియా తన ఎగుమతులను యూరప్‌కు పంపాలంటే ఈ మార్గమే బెస్ట్. కానీ హౌతీలు కార్గో నౌకలపై మిస్సైల్స్‌తో దాడులు చేస్తుండటంతో.. వాణిజ్య నౌకలన్నీ ఈ దారిని వదిలేసి, ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని వెళ్తున్నాయి. దీని వల్ల ఇండియా నుంచి యూరప్‌కు వెళ్లే సరుకులకు 15 నుంచి 20 రోజులు అదనపు సమయం పడుతోంది. ట్రాన్స్పోర్ట్ చార్జీలు, ఇన్సూరెన్స్ రేట్లు ఏకంగా 300 శాతం పెరిగాయి. దీనివల్ల మన ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రెండు పరిణామాలు చూస్తుంటే, ఇండియా భవిష్యత్తు వాణిజ్యానికి ఇది కచ్చితంగా పెద్ద గండమే అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్ విలువ 96.7400 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఏప్రిల్ 1, 2026 నాటికి రూపాయి విలువ 95 వద్ద పయనించగా, ఇప్పుడు మరింత బలహీనపడింది. యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే రూపాయి విలువ భవిష్యత్తులోమరింత బలహీనపడవచ్చు అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీ మారక నిల్వలు కరిగిపోతుండటం సెంట్రల్ బ్యాంకుకు పెద్ద సవాల్‌గా మారుతోంది. మరోవైపు కరెంట్ అకౌంట్ లోటు అంటే క్యాడ్ కూడా పెరుగుతుండటంతో ఆర్థిక రంగ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపాయి విలువను స్థిరీకరించేందుకు ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడుతుండటంతో ఆర్బీఐ ప్రయత్నాలు పరిమిత ఫలితాలనే ఇస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున నిధులను వెనక్కి తీసుకుంటుండటం రూపాయి పతనానికి మరో ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
పెరుగుతున్న చమురు ధరలు , బలహీనపడుతున్న రూపాయి ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడే అవకాశం ఉంది. ఈ ధరల పెరుగుదల రవాణా రంగాన్ని అతలాకుతలం చేస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యుడి నడ్డి విరుస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లను తగ్గించకుండా నిరోధించవచ్చు. దీనివల్ల గృహ రుణాల వంటి ఈఎంఐల భారం మరింత పెరుగుతుంది. వ్యాపార సంస్థలకు రుణాలు ప్రియమై పారిశ్రామిక వృద్ధి మందగిస్తుంది. ఈ ఆర్థిక అనిశ్చితిని తట్టుకునేందుకు పారిశ్రామిక వర్గాలు ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలపై తీవ్రమైన చర్చలు జరుపుతున్నాయి. ఈ ధరల పెరుగుదల ప్రభావం కేవలం ఆటోమొబైల్ రంగానికే పరిమితం కాకుండా, వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ట్రాక్టర్ల వాడకం, నీటి పారుదల మోటార్లు , ఎరువుల రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల రైతాంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
ఈ గండాన్ని అధిగమించడానికి భారత్ వద్ద ఉన్న వ్యూహమేంటి అనేది చూడాలి. చమురు దిగుమతుల డైవర్సిఫికేషన్. మనం కేవలం మిడిల్ ఈస్ట్ దేశాల మీద మాత్రమే ఆధారపడకూడదు. రష్యా నుంచి ఇప్పటికే తక్కువ ధరకు ఆయిల్ కొంటున్నాం, దాన్ని మరింత కొనసాగించాలి. అమెరికా, ఆఫ్రికా ,లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా ముడిచమురు సరఫరాను పెంచుకోవాలి. అప్పుడు ఒక ప్రాంతంలో గొడవలైనా మనకు మరో ప్రత్యామ్నాయం ఉంటుంది. ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు అన్వేషించాలి. ఎర్ర సముద్రం బ్లాక్ అయినప్పుడు మనకు మరో మార్గం కావాలి. అందుకే ఇటీవల G20 సమ్మిట్‌లో ఇండియా ప్రకటించిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ను వేగవంతం చేయాలి. అలాగే రష్యా-ఇండియాలను కలిపే ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ను కూడా పూర్తిగా వాడుకలోకి తీసుకురావాలి. అప్పుడు సముద్ర మార్గాలపై ఆధారపడటం తగ్గుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ దీర్ఘకాలిక పరిష్కారం. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ , గ్రీన్ హైడ్రోజన్ వైపు దేశం వేగంగా అడుగులు వేయాలి. మనం ఆయిల్ వాడకం తగ్గిస్తే, ఏ దేశం ఎవరితో యుద్ధం చేసుకున్నా మన దేశం సేఫ్‌గా ఉంటుంది.

