కరువు సాయం ఎకరానికి రూ. 10 వేలు ..? సీఎం సంచలన నిర్ణయం!
కామెంట్లు (0)

ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులతో పొలాలన్నీ ఎండిపోతున్నాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే వాడిపోతుంటే అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలాంటి కష్టకాలంలో రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై సమగ్ర నివేదిక రూపొందించిన ప్రభుత్వ యంత్రాంగం.. బాధిత రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కీలక ప్రతిపాదన పంపింది. ఎండిపోయిన పంటలకు ఎకరానికి ఏకంగా 10వేల చొప్పున పరిహారం అందించాలని అందులో సూచించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణ వ్యవసాయ రంగం మీద స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిపోయింది, బోర్లలో నీళ్లు పడటం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. తెలంగాణలోని మొత్తం 320 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. అందులో ఏకంగా 117 మండలాల్లో అయితే అత్యంత తీవ్రమైన కరువు తాండవిస్తోందని అధికారులు గుర్తించారు. అక్కడ పచ్చటి పైరు చూడటం కూడా కష్టంగా మారిపోయిందని నివేదికలో పొందుపరిచారు.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల 18వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. వరి, పత్తి, మక్కజొన్న లాంటి ప్రధాన పంటలన్నీ నీరు లేక ఎండిపోయాయి. అయితే, పూర్తిగా ఎండిపోయిన పంటల పరిస్థితి పక్కన పెడితే.. మరో 7 లక్షల ఎకరాల్లో పంటలు ప్రస్తుతం వాడిపోతున్న దశలో ఉన్నాయి. వీటికి కనీసం ఒక్క తడి సాగునీరు అందిస్తే చాలు, ఆ పంటలను కాపాడుకోవచ్చు. అందుకే ఈ 7 లక్షల ఎకరాలకు ఎలాగైనా నీరు అందించేలా ఇరిగేషన్ , వ్యవసాయ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

