పాక్ దగ్గర ఉన్న అణుబాంబులు సురక్షితమేనా?..ఐఏఈఏ ఏం చెప్పింది?
కామెంట్లు (0)

నిత్యం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నా బుద్ది మార్చుకోని దేశం పాకిస్థాన్. ఇలాంటి ఒక అస్థిరమైన దేశం దగ్గర అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలు ఉంటే ప్రపంచ దేశాలకు ప్రమాదం. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం.. ఎందుకంటే వాళ్ల దగ్గర ఎలాంటి పటిష్టమైన భద్రత లేని అణ్వాయుధాలు ఉన్నాయి అని ఓపెన్‌గానే కామెంట్ చేశారు. ఒకవేళ దేశంలో అల్లర్లు జరిగి, సైన్యం చేతుల్లో నుంచి ఆ అణుబాంబులు ఉగ్రవాదుల చేతికి వెళితే.. ఈ ప్రపంచం ఏమైపోతుందో అన్న భయం అగ్రరాజ్యాలను సైతం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ భయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక సంచలన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకు చెందిన నిపుణుల బృందం ఒక సంచలన రిపోర్టును బయటపెట్టింది.
ఇంటర్నేషనల్ ఫిజికల్ ప్రొటెక్షన్ అడ్వైజరీ సర్వీస్..ఇది ప్రపంచవ్యాప్తంగా అణు పదార్థాలు, అణు కేంద్రాలు ఎంత భద్రంగా ఉన్నాయో అంచనా వేసి, వాటిని ఉగ్రవాదులు లేదా దొంగలు ఎత్తుకెళ్లకుండా దేశాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తుంది. చరిత్రలో తొలిసారిగా.. ఐపీపీఏఎస్ కు చెందిన ఒక ఏడుగురు సభ్యుల నిపుణుల బృందం పాకిస్థాన్‌లో ఏకంగా 12 రోజుల పాటు పర్యటించింది. ఈ 12 రోజుల పాటు వాళ్లు పాకిస్థాన్ అణు భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను జల్లెడ పట్టారు. ఈ బృందానికి మొరొకో ఏజెన్సీ ఫర్ న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మాజీ డైరెక్టర్ జనరల్ ఖమ్మర్ రాబిట్ నేతృత్వం వహించారు. ఈ టీమ్‌లో చైనా, రొమేనియా, రష్యా, స్లొవేకియా లాంటి దేశాలకు చెందిన టాప్ న్యూక్లియర్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు.. ఐఏఈఏకు చెందిన ఇద్దరు స్టాఫ్ మెంబర్లు కూడా ఉన్నారు. వీరంతా కలిసి పాకిస్థాన్‌లోని న్యూక్లియర్ మెటీరియల్ దాచిన ప్రదేశాలు, అణ్వాయుధ కేంద్రాలు, వాటి చుట్టూ ఉన్న ఫిజికల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, మిలిటరీ ప్రొటోకాల్స్ పనితీరును అత్యంత నిశితంగా గమనించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే పాక్ సైన్యం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందనే విధానాలను కూడా వారు అంచనా వేశారు.



