వేల కోట్ల వారసుడికి తండ్రి పెట్టిన పరీక్ష..ఈ తండ్రి ప్లాన్ చూస్తే సలాం కొట్టాల్సిందే!

ఏకంగా రూ.6000 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండి కూడా, తన కన్న కొడుకుని ఎవరికీ తెలియని ఒక కొత్త సిటీలో అనాథలా వదిలేశాడు. జేబులో కనీసం తినడానికి డబ్బులు లేక, ఫోన్ లేక అతను నరకం అనుభవించాడు. అయితే ఈ తండ్రి ఒక సాధారణ వ్యాపారవేత్త కాదు. ఓ డైమండ్ కింగ్. దీపావళి వస్తే తన కంపెనీలో పనిచేసే కార్మికులకు వందల కొద్దీ కార్లు, ఫ్లాట్లు, డైమండ్స్ బోనస్ గా ఇచ్చే హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ ఫౌండర్లలో ఒకరైన ఘన్‌శ్యామ్ ధోలాకియా. తన 23 ఏళ్ల కొడుకు హితార్త్ ధోలాకియాను అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించాడు. అమెరికా నుంచి రాగానే ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి వేల కోట్ల కంపెనీకి సీఈఓను చేయలేదు. తన చేతిలో కేవలం 500 రూపాయలు పెట్టి ఎలా బ్రతకాలో చెప్పాడు. అసలు విషయం ఏమిటంటే హితార్త్ ధోలాకియా.. హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ యజమాని ఘన్‌శ్యామ్ ధోలాకియా కొడుకు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చేశాడు. న్యూయార్క్ వీధుల్లో లగ్జరీ కార్లు, పబ్బులు, పార్టీలు, ఖరీదైన బ్రాండ్స్.. ఇలా ఏ లోటూ లేకుండా పెరిగాడు. చదువు పూర్తయ్యాక 2017 జూన్ లో గుజరాత్ లోని సూరత్ కు తిరిగి వచ్చాడు. తాను తిరిగి రాగానే తండ్రి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలలేదు. ఘన్‌శ్యామ్ ధోలాకియా మైండ్ సెట్ వేరు. ఆ కుటుంబంలో ఒక రూల్ ఉంది. విదేశాల్లో చదువుకుని రాగానే, ఆ విలాసాలన్నీ మర్చిపోయి, గ్రౌండ్ లెవెల్ లో జీవితం అంటే ఏంటో నేర్చుకోవాలి. తండ్రి హితార్త్ ను పిలిచి, ఒక నెల రోజుల పాటు ఇంటికి దూరంగా, ఎవరికీ తెలియని నగరంలో బతకాలి. నీ దగ్గర ఫోన్ ఉండకూడదు. ఇంట్లోంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లకూడదు. నేను కేవలం 500 రూపాయలు ఇస్తాను. ఆ డబ్బుతోనే నువ్వు ఉండటానికి ఇల్లు వెతుక్కోవాలి, ఉద్యోగం సంపాదించాలి. నీ ఐడెంటిటీ, ధోలాకియా అనే నీ ఇంటిపేరు ఎక్కడా వాడకూడదు. ఒక ఉద్యోగం వారం కంటే ఎక్కువ చేయకూడదు. అలా నాలుగు వారాల్లో కనీసం నాలుగు ఉద్యోగాలు చేసి, నీ సొంత కాళ్ల మీద బతికి చూపించు అని చెప్పాడు.
ఒక ఎన్వలప్ కవర్ లో హైదరాబాద్ ఫ్లైట్ టికెట్, 500 రూపాయలు పెట్టి ముంబై ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేశారు. హైదరాబాద్ రోడ్ల మీద మూడు రోజులు కాళ్లు అరిగేలా తిరిగితే..ఎట్టకేలకు సికింద్రాబాద్ లోని ఒక మెక్‌డొనాల్డ్స్ ఔట్ లెట్ లో జాబ్ దొరికింది. నెల జీతం కేవలం 4,000 రూపాయలు అని మేనేజర్ చెప్పాడు. అక్కడ ఐదు రోజులు డెలివరీ బాయ్ గా, క్లీనర్ గా పని చేశాడు. కానీ ఆ డబ్బులు బతకడానికి సరిపోవని, తండ్రి పెట్టిన కండిషన్ ప్రకారం వారం తర్వాత ఆ పని మానేశాడు. ఆ తర్వాత ఒక మార్కెటింగ్ కంపెనీలో ఆఫీస్ బాయ్ కమ్ డెలివరీ బాయ్‌గా చేరాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో సైకిల్ మీద తిరిగి పార్సిల్స్ డెలివరీ చేశాడు. మూడో వారం సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర వైట్ బోర్డులు తయారు చేసే ఒక చిన్న పరిశ్రమలో రోజువారీ కూలీగా పని చేశాడు. చివరగా నాలుగో వారం అడిడాస్, జేడ్ బ్లూ బట్టల షోరూమ్ లో సేల్స్ మెన్ గా పనిచేశాడు. ఇలా నెల రోజులు తిరిగే సరికి హితార్త్ చేతికి వచ్చిన మొత్తం సంపాదన కేవలం 5,000 రూపాయలు. నిజానికి ఈ ధోలాకియా ఫ్యామిలీ ఇలా ఒక కొడుకుని కష్టపెట్టడం ఇదే తొలిసారి కాదు. ఇదొక కుటుంబ ఆచారం. విదేశాల్లో చదువుకుని రాగానే, ఆ విలాసాలు అన్నీ పోయి జీవితం పట్ల బాధ్యత రావాలని ఇలా ఏ ఊరు పడితే ఆ ఊరు పంపించేస్తారు. గతంలో హితార్త్ అన్నయ్య పింటూ తులసిభాయ్ ధోలాకియాను కూడా ఇలాగే పంపించారు.. ఈరోజు అతను ఆ 6000 కోట్ల కంపెనీకి సీఈఓ గా ఉన్నాడు. అలాగే ద్రవ్య అనే మరో కొడుకుని కేరళలోని కొచ్చికి పంపించి బేకర్ గా పని చేయించారు. ఈ కుటుంబం ఎంప్లాయీస్ తో ఎంత మంచిగా ఉంటుందంటే.. ప్రతి ఏటా దీపావళి వస్తే తమ కంపెనీలో కష్టపడి పనిచేసిన కార్మికులకు 400 ఫ్లాట్లు, 1200కు పైగా కార్లను బోనస్ గా ఇచ్చి దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించారు. కష్టపడి పైకొచ్చిన ఆ కుటుంబానికి కష్టం విలువ తెలుసు కాబట్టే, తమ పిల్లలకు ఆస్తులు ఇచ్చే బదులు, జీవిత అనుభవాన్ని ఆస్తిగా ఇస్తున్నారు. నెల రోజులు పూర్తి కాగానే తన కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కుని, హితార్త్ వాళ్ల చెల్లి, ఫ్యామిలీ అంతా హైదరాబాద్ కు వచ్చారు. అతను పడుకున్న ఆ చిన్న లాడ్జిని, అతను పడ్డ కష్టాన్ని చూసి కుటుంబమంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. తండ్రి పెట్టిన ఛాలెంజ్ లో గెలిచిన హితార్త్, ఆ రోజు తన తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ఈరోజు అతను తన కుటుంబ బిజినెస్ ను వందల కోట్లలో డెవలప్ చేస్తున్నాడు. ఆస్తులు ఉన్నాయి కదా అని పిల్లలను గారాబం చేసి పాడుచేసే ఎంతోమంది తల్లిదండ్రులకు ఇదొక కనువిప్పు. అనుభవాలనే ఆస్తులుగా ఇస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఎలాగైనా కస్టపడి బతికే సర్వైవల్స్ గా ఎదుగుతారు. ఆ కష్టం నేర్పిన అనుభవాలే అత్యుత్తమ శిఖరాలను అధిరోహించే మెట్లుగా ఉపయోగించుకుంటారు.



