సౌదీలో రెడ్ అలర్ట్!..సీక్రెట్ బంకర్లోకి యువరాజు..అసలేం జరుగుతోంది?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నదేశాలలో ఒకటి. అలాగే చమురు ఉత్పత్తిలో రారాజు.. టెక్నాలజీలో దూసుకుపోతున్న దేశం..అదే సౌదీ అరేబియా. కానీ, ఇప్పుడు ఆ దేశం తీవ్ర భయాందోళనలో వణికిపోతోంది. ఎప్పుడు ఎటునుంచి ఏ డ్రోన్ వచ్చి పడుతుందో, ఏ మిస్సైల్ ప్రాణాలు తీస్తుందో తెలియని పరిస్థితి.సౌదీ అరేబియా ఇప్పుడు రెడ్ అలర్ట్‌లో ఉంది. దాడులను ఆపలేక చేతులెత్తేసిన పరిస్థితి. స్వయంగా ఆ దేశ యువరాజే ప్రాణ భయంతో అండర్ గ్రౌండ్ బంకర్ లోకి వెళ్లిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సౌదీ ప్రధాన విమానాశ్రయాలే లక్ష్యంగా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు పాల్పడుతున్నది మరెవరో కాదు.. హౌతీ తిరుగుబాటుదారులు. నిరంతరం డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో వీరు విరుచుకుపడుతున్నారు. సాధారణంగా సౌదీ దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ, హౌతీలు ప్రయోగిస్తున్న సూక్ష్మమైన, అత్యాధునిక డ్రోన్లను అడ్డుకోవడంలో సౌదీ డిఫెన్స్ సిస్టమ్స్ విఫలమవుతున్నాయి. ఎయిర్‌పోర్టులపై జరిగిన ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణనష్టం పెరుగుతుండటం, దాడులను పూర్తిగా తిప్పికొట్టలేకపోతుండటంతో సౌదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఈ దాడుల తీవ్రత ఎంతలా ఉందంటే.. ఏకంగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, దేశానికి కాబోయే రాజు అయిన 41 ఏళ్ల మొహమ్మద్ బిన్ సల్మాన్ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసిన సంచలన నివేదిక ప్రకారం.. యువరాజు గత వారం రోజులుగా బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. నివేదికల ప్రకారం, ఆయనను అత్యంత పటిష్టమైన, భారీ భద్రత కలిగిన అండర్ గ్రౌండ్ బంకర్లకు తరలించారు. ఈ బంకర్లు ఎటువంటి బాంబు దాడులైన, అణు దాడులైన తట్టుకునేలా నిర్మించబడ్డాయి. తన రాజభవనాలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, దేశాధినేతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక దేశాన్ని శాసించే నాయకుడు ఇలా బంకర్‌కు పరిమితం కావడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, సౌదీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ప్రవాసులకు ఒక అత్యంత కఠినమైన హెచ్చరికను జారీ చేసింది. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు భాషల్లో ఈ సందేశాన్ని పంపింది. ఆకాశంలో క్షిపణులు వెళ్తున్నా, డ్రోన్లను మా రక్షణ వ్యవస్థలు అడ్డగిస్తున్నా, లేదా అవి ఎక్కడ పడుతున్నాయో వీడియోలు తీసినా.. ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నా.. వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వెంటనే అరెస్టు చేసి జైలులో వేస్తాం అని స్పష్టంగా పేర్కొంది. అసలు ప్రభుత్వం ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చింది? దీని వెనుక ఒక వ్యూహం ఉంది. క్షిపణులు ఎక్కడ పడుతున్నాయి? డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడి నుంచి ఫైర్ చేస్తున్నాయి? అనే వీడియోలు సోషల్ మీడియాలో పెడితే, ఆ సమాచారం శత్రువులైన హౌతీలకు చేరుతుంది. దాని ద్వారా సౌదీ రక్షణ వ్యవస్థల లోపాలను వారు పసిగట్టే ప్రమాదం ఉంది. పైగా ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయి. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
అసలు ఈ హౌతీలు ఎవరు? సౌదీకి వాళ్లకి ఉన్న పగ ఏంటి? అనేది చూసుకుంటే హౌతీలు యెమెన్ దేశానికి చెందిన ఒక సాయుధ తిరుగుబాటు బృందం. యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఒకవైపు హౌతీలు ఉంటే, మరోవైపు యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి ఉంది. ఈ వివాదంలో ఇరాన్ దేశం హౌతీలకు అండగా ఉండి ఆయుధాలు, డ్రోన్లు సప్లై చేస్తోందని సౌదీ ఆరోపణ. గత కొన్నేళ్లుగా హౌతీలు నేరుగా సౌదీ సరిహద్దులు దాటి, సౌదీ నగరాలు, చమురు కర్మాగారాలు, ఎయిర్‌పోర్టులపై దాడులు చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం తుపాకులు, చిన్న రాకెట్లకు పరిమితమైన హౌతీలు, ఇప్పుడు అత్యాధునిక సూసైడ్ డ్రోన్లు , లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ వాడుతున్నారు. వీటిని రాడార్లు పసిగట్టడం చాలా కష్టం. అందుకే సౌదీ అరేబియా ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా డిఫెన్స్‌లో పడిపోయింది. సౌదీ అరేబియాలో ఇప్పుడు నెలకొన్న ఈ రెడ్ అలర్ట్ పరిస్థితి కేవలం ఆ దేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి ప్రమాదకరం. ఎందుకంటే, సౌదీ చమురు ఉత్పత్తిపై ఏమాత్రం ప్రభావం పడినా, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. అందుకే అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి.మరి చూడాలి, బంకర్ నుంచి యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ హౌతీల దాడులకు ఎలాంటి కౌంటర్ ఇస్తారో.



