ప్రపంచంలో అత్యంత ధనవంతులెవరు..? వారి సంపద ఎంత..? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎవరు ముందున్నారు..? ప్రతి ఏడాది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే జాబితానే హురున్ రిసెర్చ్ సంస్థ విడుదల చేసే హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్. తాజాగా విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రపంచ వ్యాప్తంగా సంపద పంపిణీ ఎలా ఉందో మరోసారి చూపించింది.ప్రపంచ కుబేరుల జాబితాలో మరోసారి భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తాజాగా విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం బిలియనీర్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా చూస్తే ముకేశ్ అంబానీ మరోసారి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అంతేకాదు ఆసియాలోనూ అగ్రస్థానాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో మాత్రం అంబానీ 17వ స్థానంలో కొనసాగుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే అంబానీ కుటుంబ సంపద 9 శాతం పెరిగి సుమారు 9.8 లక్షల కోట్ల రూపాయాలకు చేరుకున్నట్లు నివేదిక తెలిపింది. భారతీయ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారని హురున్ నివేదిక పేర్కొంది. ప్రతి ఏడాది ప్రపంచ కుబేరుల సంపద వివరాలను విడుదల చేసే హురున్ రిసెర్చ్ సంస్థ ఈ సారి కూడా ప్రపంచ టాప్ బిలియనీర్లతో పాటు భారతదేశంలోని టాప్ సంపన్నుల లిస్ట్ ను ప్రకటించింది. దేశంలో సంపద పరంగా రెండో స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సంపద సుమారు 7.5 లక్షల కోట్ల రూపాయాలుగా నమోదైంది. మూడో స్థానంలో రోష్నీ నాడార్ హెచ్ సీఎల్ టెక్ – 3.2 లక్షల కోట్లతో నిలిచారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే రోష్నీ నాడార్ మన టాప్ 10 బిలియనీర్లలోని ఏకైక మహిళగా నిలిచారు. టాప్ 10 స్థానాల్లో ఈ ముగ్గురు తర్వాత జాబితాలో నిలిచిన సంపన్నులను చూస్తే..సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన సైరస్ పూనావాలా, ఆదిత్య బిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళం బిర్లా, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీ, నీరజ్ బజాజ్ ఆటో కుటుంబం,అశోక్ హిందుజా ఫ్యామిలీ,డీమార్ట్ వ్యవస్థాపకులు రాధాకిషన్ దమానీ సంపద విషయంలో ప్రపంచ కుబేరుడికి.. భారత కుబేరుడికి మధ్య అంతరం చూస్తే.. ఎంత భారీ గ్యాప్ అన్నది ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచ కుబేరుడిగా ఐదో ఏడాది టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిలిచారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద 89 శాతం పెరిగి ఆయన సంపద మొత్తం అక్షరాల 72 లక్షల కోట్ల రూపాయాలకు చేరింది. ముకేశ్ అంబానీ సంపదతో పోలిస్తే దగ్గర దగ్గర ఏడు రెట్లు అధికం కావటం గమనార్హం. ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగు వారు పలువురు ఉన్నారు. తెలుగు వారికి సంబంధించి టాప్ 10 సంపన్నుల్లో తొలిస్థానం దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళి దివి టాప్ స్థానంలో నిలిచారు. రెండు మూడుస్థానాల్లో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అధినేతలు పిచ్చిరెడ్డి.. క్రిష్ణారెడ్డిలు నిలిచారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన సంపన్నుల్లో అత్యధికులు ఫార్మా.. హెల్త్ రంగానికి చెందిన వారే ఉండటం విశేషం.