ఇటీవల టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగు దర్శకులు ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం భిన్నంగా మారింది. మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధించడంతో, ఇతర భాషల దర్శకులు వారితో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తమిళ, మలయాళ దర్శకులు మన స్టార్ హీరోలతో ప్రాజెక్టులు చేయాలని ఆసక్తి చూపుతుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో టాలీవుడ్‌లోని కొందరు దర్శకులు మాత్రం మన స్టార్ హీరోల డేట్స్ దొరకడం లేదని బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుండటం కూడా చర్చకు దారి తీస్తోంది. పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలకు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే కోలీవుడ్ దర్శకులు కూడా మన హీరోలతో సినిమాలు చేస్తే మరింత పెద్ద మార్కెట్ దక్కుతుందని భావిస్తున్నారు.
ఈ ట్రెండ్‌లో ముందుగా నిలిచింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే అల్లు అర్జున్ మరో తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. అట్లీ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనే ప్లాన్‌లో నిర్మాతలు ఉన్నారు. దీంతో బన్నీ వరుసగా తమిళ దర్శకులతో సినిమాలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
ఇక్కడితో ఆగకుండా అల్లు అర్జున్ మరో మలయాళ దర్శకుడితో కూడా సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మలయాళ నటుడు దర్శకుడు బసిల్ జోసెఫ్‌తో బన్నీ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన శిరీష్ వివాహ వేడుకలో బసిల్ జోసెఫ్ పాల్గొనడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ సిద్ధమవుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ట్రెండ్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న ఆయన, మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2’ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఇవి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు కలిగించిన సినిమాలు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈసారి తెలుగు దర్శకుడితో కాకుండా మలయాళ దర్శకుడితో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడట. 2024లో విడుదలైన మలయాళ చిత్రం ‘కిష్కింద కాండం’ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కేవలం ఏడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 77 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ దర్శకుడు ప్రభాస్‌ను కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోను దింజిత్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో అది వెంటనే వైరల్ అయింది. దీంతో ప్రభాస్ – దింజిత్ కాంబినేషన్లో సినిమా వస్తుందా అనే చర్చ మొదలైంది. ఇలా చూస్తే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలపై ఇతర భాషల దర్శకుల దృష్టి మరింత పెరిగిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మన హీరోల మార్కెట్ పెరిగిన కొద్దీ ఇతర ఇండస్ట్రీల దర్శకులు కూడా వారితో సినిమాలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. వివిధ ఇండస్ట్రీల దర్శకులు కలిసి పని చేస్తే కొత్త కథలు, కొత్త స్టైల్స్ ప్రేక్షకులకు కనిపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే రాబోయే రోజుల్లో టాలీవుడ్ స్టార్ హీరోలు తమిళ, మలయాళ దర్శకులతో చేసే ఈ కొత్త ప్రాజెక్టులు ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచే అవకాశం ఉందని చెప్పొచ్చు.