ప్రభాస్ ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. భారతదేశంలోనే కాకుండా చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెద్ద స్టార్ హీరోలు సినిమాల కోసం పెద్దగా ప్రమోషన్లు చేయకుండానే థియేటర్లను షేక్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా గత చిత్రాల సమయంలో కేవలం ఒకట్రెండు ఇంటర్వ్యూలకే పరిమితమయ్యారు. కానీ, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ వార్ మూవీ ఫౌజీ విషయంలో ప్రభాస్ తన రూట్ పూర్తిగా మార్చబోతున్నారనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈసారి స్వయంగా ప్రభాస్ దేశంలోని ప్రధాన నగరాలన్నీ పర్యటించి, ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోలు విసృతంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం దాదాపు తగ్గించేశారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్ వంటి అగ్ర తారలు పఠాన్ , ధురంధర్ వంటి భారీ చిత్రాలకు భారీ స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టకపోయినా బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నారు. అటు టాలీవుడ్‌లోనూ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి దిగ్గజాలు వరుస ప్రమోషనల్ టూర్లకు వెళ్లకపోయినా వారి సినిమాలు భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. దీనివల్ల స్టార్ హీరోలకు అసలు గ్రౌండ్ ప్రమోషన్లు అవసరమా? అనే విశ్లేషణ మొదలైంది. ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా దాదాపు ఇదే స్టైల్‌ను ఫాలో అయ్యారు. ఆయన దేశవ్యాప్త క్రేజ్ కారణంగా, ప్రభాస్ ఒక చిన్న వీడియో విడుదల చేసినా లేదా సోషల్ మీడియాలో పోస్టర్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అయిపోయేది. ఇటీవల విడుదలైన ది రాజా సాబ్ సమయంలోనూ ప్రభాస్ ప్రత్యేకంగా ఒకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు తప్ప.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు రాబోతున్న ఫౌజీ కోసం మాత్రం ఆయన తన శైలిని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాను ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. తాజా రిపోర్టుల ప్రకారం.. సినిమా విడుదలకు ముందు ప్రభాస్ దేశవ్యాప్తంగా ప్రధాన మెట్రో నగరాల్లో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా వంటి నగరాల్లో ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించి, పలు ఇంటర్వ్యూలలో పాల్గొననున్నారు. అంతేకాకుండా, విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన మ్యూజికల్ ట్రాక్స్‌ను నేరుగా కాలేజీలు, బహిరంగ వేదికలపై ఆవిష్కరించే ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా ప్రభాస్ భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రేక్షకులను నేరుగా కలుసుకోవడం ద్వారా సినిమాకి అపూర్వమైన హైప్ తీసుకురావాలన్నది ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. భారీ ప్రమోషన్లు మాత్రమే కాదు.. బాక్సాఫీస్ లక్ష్యాలు కూడా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫౌజీతో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 500 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించాలనే భారీ టార్గెట్‌ను మేకర్స్ పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఏ భారతీయ సినిమాకు కూడా ఇంతవరకు మొదటి రోజే 500 కోట్ల మైలురాయి సాధ్యం కాలేదు. అయితే, ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంతటా ఏకకాలంలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేసి, ప్రభాస్ గ్రౌండ్ ప్రమోషన్ల మద్దతుతో టికెట్ బుకింగ్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాలనేది మేకర్స్ ఆలోచన. ఈ ప్రణాళిక ఏమాత్రం వర్కౌట్ అయినా, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ సరిహద్దులు తిరగరాయడం ఖాయం. సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న ప్రస్తుత కాలంలో.. ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం. కంటెంట్ మీద ఉన్న నమ్మకమే ఆయన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేస్తోంది. సరైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తే, డిసెంబర్ 3న బాక్సాఫీస్ సరికొత్త చరిత్రను చూడటం ఖాయంగా కనిపిస్తోంది.