సినీ ఇండస్ట్రీలో రూమర్స్ కొత్త కాదు. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌లు బయట కలిసి కనిపిస్తే చాలు… వాళ్ల మధ్య ఏదో స్పెషల్ బాండ్ ఉందంటూ కథలు స్టార్ట్ అయిపోతాయి. అందులో కొన్ని నిజం కావొచ్చు కానీ, ఎక్కువశాతం మాత్రం రుమౌర్స్ అవుతుంటాయి. అలాంటి రూమర్స్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించిన వార్త ఏదైనా ఉందంటే… బాలీవుడ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ – కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పెళ్లి వార్తలే. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకుల తరవాత ధనుష్ ఒంటరిగా ఉన్నాడనే విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ ఆయన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవుతున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తోడుగా, ధనుష్ – మృణాల్ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. ఇక మృణాల్ కూడా తన సోషల్ మీడియా వీడియోలకు తరచూ తమిళ పాటలు ఉపయోగించడం, ఈ వార్తలపై సరదాగా స్పందించడం వంటివి చూసి చాలామంది “ఏదో ఉంది” అని అనుకున్నారు. అంతేకాదు, ధనుష్ కుటుంబ సభ్యులతో మృణాల్ కలిసి ఫోటోలు దిగడం, ధనుష్ సోదరి ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవడం వంటి విషయాలు కూడా ఈ పెళ్లి రూమర్స్‌కు మరింత ఊతమిచ్చాయి. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ ఊహాగానాలన్నింటికీ ఒక్కసారిగా బ్రేక్ వేస్తూ మృణాల్ ఠాకూర్ తాజాగా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ధనుష్ తనకు అన్నయ్య లాంటివాడు అని చెప్పి, పెళ్లి వార్తలను పూర్తిగా ఖండించింది. అలాగే రీసెంట్ గా మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, “నన్ను ఎవరూ పిలవలేదు ఆ పెళ్లికి. నేను ఈ రూమర్స్ అన్నీ చూస్తూ చాలా నవ్వుకుంటున్నాను. ఇలాంటివి సృష్టిస్తున్న వాళ్లందరికీ థ్యాంక్స్. మీరంతా నా కోసం ఫ్రీ పీఆర్ చేస్తున్నారు. దీనిపై నేను చెప్పాలనుకుంటున్నదేంటంటే.. మీరు అనుకుంటున్నట్లు అది నిజం కాదు. కావాలంటే ఫిబ్రవరి 14న మీరే చూస్తారు. నేను పెళ్లి చేసుకుంటే ఆ వార్తని శ్రీ గణేశుడితో పాటు అభిమానులతోనూ తప్పకుండా పంచుకుంటాన’’ని చెప్పి అందరి నోర్లు మూయించింది! అలాగే ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న తన పెళ్లి వివాదంపై సోషల్ మీడియా లో స్పందిస్తూ, “ధనుష్ నాకు ఎప్పుడూ అన్నయ్య లాంటివాడే. మా మధ్య ఉన్నది పూర్తిగా పరస్పర గౌరవం, వృత్తిపరమైన అనుబంధం మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు” అని మృణాల్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఒక మహిళ చేసిన ప్రయాణాన్ని గుర్తించకుండా, ఆమె వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు సృష్టించడంలో ప్రజలు ఎందుకు అంత ఆసక్తి చూపుతారో తనకు అర్థం కావడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా అందరికీ ఒక స్వరం ఇస్తుందనీ, కానీ దానికి బాధ్యత కూడా అవసరమని మృణాల్ హెచ్చరించినట్లు సమాచారం. “క్లిక్‌లు, లైక్‌లు, షేర్‌లు చిన్నవిగా అనిపించొచ్చు. కానీ అవి నిజమైన మనుషులను బాధిస్తాయి. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టంగా చెబుతున్నాను” అని ఆమె తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పోస్ట్ నిజంగా మృణాల్ ఠాకూర్ అధికారికంగా పెట్టిందా? లేక ఆమె అభిమానులు ఆమె తరఫున ఇలా రూపొందించారా? అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.