వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్ లో మొట్టమొదటి డాల్బీ సినిమా, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రేక్షకులకు ఈ ‘అల్లు సినిమాస్’ అత్యాధునిక సాంకేతికత, లగ్జరీ, సౌకర్యవంతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయని తెలిపారు. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్‌ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసిన తరువాత అలాంటి ఓ లగ్జరీ థియేటర్ కట్టాలని అనిపించిందన్నారు. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారని అప్పుడు కొన్ని ఐడియాలు వచ్చాయిన్నారు. లార్జ్ ఫార్మాట్, కొత్త ఎక్స్‌పీరియెన్స్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా తమ ‘అల్లు సినిమాస్’ మొదలైందన్నారు. 648 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ ఫ్లాగ్‌షిప్ డాల్బీ సినిమా ఆడిటోరియం ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ సైజులలో ఒకటి. 75 అడుగుల వెడల్పు ఫ్లాట్ యాస్పెక్ట్ రేషియోలో, భారతదేశంలో అతిపెద్ద డాల్బీ సినిమాగా నిలిచింది. హైదరాబాద్‌లో ఇలాంటిది ఇంతకు ముందు లేదన్న సంగతి తెలిసిందే. కోకాపేటలోని ఏడు ఎకరాల్లోని అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న ‘అల్లు సినిమాస్’ భారతదేశ వినోద రాజధానికి మరో మైలురాయిగా నిలుస్తుంది.