ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకులు ఇప్పుడు కేవలం మామూలు కమర్షియల్ కథలకు మాత్రమే కాకుండా, పురాణాలు ఇతిహాసాలను బేస్ చేసుకుని రూపొందిస్తున్న కథల పట్ల కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నిర్మాతలు, దర్శకులు మన దేవుళ్ళ కథలను, పురాణ పాత్రల చుట్టూ తిరిగే కథలను భారీ ఎత్తున రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. రాముడు, హనుమంతుడు, హిరణ్యకశ్యపుడు వంటి పాత్రలు ఎన్నో సంవత్సరాలుగా మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆ పాత్రల చుట్టూ నడిచే కథలకు ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ తరహా కథలకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రేక్షకుల మనసుల్లో భక్తి, గౌరవం, ఉత్కంఠ కలిగించే ఇటువంటి సినిమాలు ఒక వైపు ఆధ్యాత్మిక భావనను కలిగిస్తూనే మరోవైపు భారీ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అందించే అవకాశం ఉంటుంది అందుకనే ప్రేక్షకులు ఆ మ్యాజిక్ ను వెండితెరపై ఆస్వాదించేందుకు ఆసక్తికనబరుస్తారు. అందుకే దర్శకులు ఈ కథలను ఇప్పుడున్న టెక్నాలజీతో మరింత అద్భుతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని సినిమాలు పూర్తిగా పురాణాల ఆధారంగా తెరకెక్కుతుంటే, మరికొన్ని సినిమాల్లో పురాణాల టాపిక్ ను కథలో భాగంగా తీసుకొస్తున్నారు. ఈ విధంగా పురాణాల ప్రభావం ఇప్పుడు సినిమాల్లో మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే భారతీయ సినిమాల్లోని కొందరు ప్రముఖ దర్శకులు ఈ నేపథ్యంతో కథలు సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పురాణ కథలపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి వల్ల రానున్న రోజుల్లో ఇటువంటి సినిమాలు మరింతగా రావడం ఖాయం. ఆ కథలు మంచి కథనంతో, అద్భుతమైన విజువల్స్‌తో వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ‘మిరాయ్’, ‘మహావతార్ నరసింహ’ వంటి సినిమాలు భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘రామాయణ’ కూడా భారీ బడ్జెట్ తో ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కుతోంది.