మన డార్లింగ్ ప్రభాస్ కి మరో అరుదైన గౌరవం…

Spread the love

బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. జపాన్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ మ్యాగజైన్‌లలో ఒకటైన ‘అనన్‌’ బ్యాక్‌ కవర్‌పై కనిపించనున్న తొలి భారతీయ సోలో హీరోగా ఆయన చరిత్ర సృష్టించబోతుండటం విశేషం. అబ్బో సూపర్ కదా… ఆ మ్యాగజిన్ కవర్ పేజీ ఈ నెల 10న విడుదల కానున్న ఓ స్పెషల్ ఎడిషన్ లో ప్రభాస్‌ ఫేమ్, ఆయనకు జపాన్‌ ప్రేక్షకుల్లో ఉన్న అపారమైన అభిమానాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ఫొటోను ప్రచురించనున్నారు. ఇప్పటికే ఆ కవర్‌ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి అదే మ్యాగజైన్‌పై దర్శనమిచ్చారు. ఇప్పుడు ఆ గౌరవం ప్రభాస్‌కు దక్కడం ఆయన అంతర్జాతీయ స్థాయిని మరోసారి రుజువు చేస్తోంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాల విజయంతో జపాన్‌లో ప్రభాస్‌కు విశేషమైన అభిమాన వర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన సినిమాలు అక్కడ ప్రత్యేకంగా విడుదల అవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ప్రేక్షకులు ఆయనను కేవలం నటుడిగా కాకుండా ఓ గ్లోబల్‌ ఐకాన్‌లా చూస్తుండటం ఆయన పాపులారిటీ కి ఒక చిన్న ఉదాహరణ.

ఇటీవల విడుదలైన విజువల్‌ స్పెక్టకల్‌ ‘కల్కి 2898 ఎ.డి’ చిత్రం కూడా జపాన్‌లో విడుదలై ఆడియన్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌ తన వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ‘ఫౌజీ’, మరోవైపు సంచలన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్‌’ చిత్రాలతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా సైన్స్‌ ఫిక్షన్‌ ప్రపంచాన్ని విస్తరించే ‘కల్కి 2’ కూడా త్వరలో పట్టాలెక్కనుండటంతో ప్రభాస్‌ కెరీర్‌లో మరో కీలక దశ ప్రారంభమవుతోంది. మొత్తానికి జపాన్‌ మ్యాగజైన్‌ బ్యాక్‌ కవర్‌పై తొలి భారతీయ సోలో హీరోగా నిలవడం ప్రభాస్‌ వ్యక్తిగత విజయమే కాకుండా భారతీయ సినిమాకు దక్కిన అంతర్జాతీయ గౌరవంగా భావించవచ్చు. ప్రాంతీయ సరిహద్దులను దాటి ప్రపంచ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఆయన ప్రయాణం ఇలాగే మరింత ఎత్తులకు చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.