టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే ఎప్పుడూ అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆయన ప్రతి కొత్త సినిమా అనౌన్స్ అయినప్పుడల్లా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడటం సహజం. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. కుటుంబ ప్రేక్షకులను, మాస్ ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి చిరంజీవి కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయంతో మెగాస్టార్ మరోసారి ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి సినిమాపై పూర్తి దృష్టి పెట్టారు. ఆయన ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లి తో మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఈసారి కూడా దర్శకుడు బాబీ ఒక పక్కా కమర్షియల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ కథలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ కు కూడా పెద్దపీట ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రీ–కూతురు మధ్య ఉండే ఎమోషన్స్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి పాత్రలో ఒక బలమైన ఎమోషనల్ డెప్త్ ఉండబోతుందని, అదే సినిమా మెయిన్ పాయింట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ ఎమోషనల్ ట్రాక్ సినిమాను మరింత బలంగా నిలబెడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అలాగే హీరోయిన్‌గా ప్రియమణి నటించే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండబోతుందట. కథలో కీలకమైన ఈ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశం గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మొదట ఈ పాత్ర కోసం కృతి శెట్టి పేరు వినిపించింది. తర్వాత ధురంధర్ భామ సారా అర్జున్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా మరో మలయాళ నటి పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. మలయాళ నటి అనస్వర రాజన్ ఈ పాత్రకు దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఈ పాత్రలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటంతో సహజంగా నటించగలిగే నటిని ఎంపిక చేయాలని దర్శకుడు బాబీ భావించారట. ఈ క్రమంలో అనస్వర రాజన్ సహజ నటన, ఎమోషన్స్ తెలియజేసే ఫీచర్స్ ఈ పాత్రకు సరిపోతాయని భావించి ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.