సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమేనని పేర్కొన్నారు. ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేది. దానిని ఎదుర్కోవడానికి ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చాం. అవినీతిని నిరోధించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఫిజికల్ క్రైమ్ నిరోధించేందుకు ఇప్పటి వరకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది. సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇక సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్ మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి పోలీసు ఉన్నతాధికారులు కొన్ని ప్రతిపాదనలు అందించారు. వీటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఆ కమిటీలో విశ్లేషించి సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.