ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్‌లలో ‘వారణాసి’ ఒకటి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో రాజమౌళి మొదటిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘బాహుబలి’, RRR వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు మరో గ్లోబల్ అడ్వెంచర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కావడంతో మరోసారి సినిమా వార్తల్లో నిలిచింది. కొద్దిరోజుల విరామం తర్వాత ‘వారణాసి’ తాజా షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లలో ఈ షెడ్యూల్ జరగనుంది. ఇందులో మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం సిద్ధమైందని తెలుస్తోంది.ఇటీవల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. చిత్రీకరణ కోసం అవసరమైన నీటి కొరత కారణంగా షెడ్యూల్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రయాణంలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “వారణాసికి బయలుదేరుదాం” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఆమె తాజా షెడ్యూల్లో పాల్గొనబోతున్నట్లు స్పష్టమైంది.ఈ సినిమాలో ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుసు కదా. కథలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పృథ్వి రాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ‘కుంభ’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. తనదైన నటనతో విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోసే పృథ్వీరాజ్, ఈ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక మహేష్ బాబు పాత్ర గురించి కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఆయన ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడు. ఇప్పటివరకు మహేష్ బాబు చేయని విధంగా పూర్తిగా కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త లుక్‌తో ఆయన కనిపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.రాజమౌళి సినిమాల్లో హీరో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ఆయన పని చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు రాజమౌళి విజన్ జతకలిస్తే, అది భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ‘వారణాసి’ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పలు భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటం విశేషం.