దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిర్మించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికీ అదే జోష్‌తో సినిమాలు చేస్తూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ హీరోలు సినిమాల వేగం తగ్గిస్తారు. కానీ బాలయ్య రూటే సెపరేటు. కుర్ర హీరోలు కూడా అందుకోలేని వేగం ఆయనది. ఇటీవల కాలంలో బాలయ్య కెరీర్ చూస్తే ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాల్లో ఆయన చూపిస్తున్న ఎనర్జీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు పవర్‌ఫుల్ మాస్ పాత్రలు చేస్తూనే, మరోవైపు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తనదైన నటనతో మెప్పిస్తున్నారు. ఇప్పుడు బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు జూన్ 10. అది బాలకృష్ణ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం ఆయన బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమాల అప్‌డేట్స్ రావడం అభిమానులకు పండగలా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు భారీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒకేసారి రాబోతున్నాయనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. “వీరసింహారెడ్డి” లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ రావచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక మరో విషయం కొరటాల శివ డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.