ఈ ఏడాది 8 నెలలు దాదాపుగా పూర్తపోయింది. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా 2027 సంక్రాంతి సినిమాల గురించే చర్చ జరుగుతోంది. అయితే సంక్రాంతి మీద అందరి దృష్టి ఉన్న సమయంలో మరో ఆసక్తికరమైన సీజన్ కూడా నెమ్మదిగా వేడెక్కుతోంది. అదే డిసెంబర్. ఈ ఏడాది చివరి నెలలో కూడా వరుసగా భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.సంక్రాంతి సీజన్లో ఒకేసారి ఎక్కువ సినిమాలు విడుదలైతే థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్, కలెక్షన్ల విషయంలో కూడా ప్రతి సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కొంతమంది నిర్మాతలు పండుగ పోటీని తప్పించుకుని డిసెంబర్ లోనే తమ సినిమాలను విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఒక్కొక్కరుగా డిసెంబర్ స్లాట్ వైపు అడుగులు వేస్తుండటంతో సంవత్సరం చివరి నెలలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సందడి ఉండేలా కనిపిస్తోంది.
డిసెంబర్ రేసులో ఇప్పటికే అధికారికంగా అడుగు పెట్టిన సినిమా ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం, హను రాఘవపూడి గత చిత్రాల తరహాలో ప్రేమ, భావోద్వేగాలతో పాటు భారీ స్థాయిలో కథను తెరకెక్కిస్తున్నారనే వార్తలు రావడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వప్రభాస్ సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.డిసెంబర్లో మరో పెద్ద సినిమా బాలకృష్ణ 111వ చిత్రం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయాలనే ఆలోచన దాదాపు ఖరారైనట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన అక్టోబర్ నుండి మళ్లీ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మిగిలిన షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసి, అనుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. బాలయ్యకు డిసెంబర్, క్రిస్మస్ సీజన్ కూడా గతంలో మంచి ఫలితాలను ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ సీజన్ ఆయన సినిమాకు కూడా కలిసొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలవబోతున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ కూడా డిసెంబర్ రేసులోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. నాగార్జునకు మాస్, మన్మథుడు వంటి సినిమాలు గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నాగ్‌కు ప్రత్యేకమైన మాస్ ఇమేజ్, స్టైలిష్ స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న నేపథ్యంలో ఆయన 100వ సినిమాపై అభిమానుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరులో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ కూడా డిసెంబర్ వైపు చూస్తున్న సినిమాల్లో ఒకటిగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ప్లాన్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, ఏడాది చివరి సీజన్‌ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్. డిసెంబర్ రేసులో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘శ్రీశ్రీ’, రామ్ పోతినేని 23వ చిత్రం కూడా వచ్చే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. ఈ సినిమాల విడుదల తేదీలపై ఇంకా స్పష్టమైన ప్రకటన లేకపోయినా, డిసెంబర్ సీజన్‌పై మేకర్స్ దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలు కూడా రేసులోకి వస్తే డిసెంబర్ బాక్సాఫీస్ మరింత రసవత్తరంగా మారడం ఖాయం.ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు, మరోవైపు తెలుగు స్టార్ హీరోల చిత్రాలు ఇలా వరుసగా రావడం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించే అవకాశం ఉంది. డిసెంబర్ రేసును మరింత ఆసక్తికరంగా మార్చే సినిమా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు క్రిస్మస్ హాలిడేస్ కలిసొస్తాయని భావిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. మిగిలిన సినిమాలు సరైన స్లాట్ కోసం ఎదురుచూస్తున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయా? సంక్రాంతి పోటీ ఎలా ఉంటుంది? ఇతర సినిమాల తేదీలు ఎలా ఉంటాయి? అనే అంశాల ఆధారంగా డిసెంబర్ విడుదలలపై తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే డిసెంబర్ విడుదలలు నిర్మాతలకు మంచి ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి. సంక్రాంతి సీజన్లో ఏకంగా అరడజను సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒక్కో సినిమాకు సరిపడా థియేటర్లు దొరకడం కష్టంగా మారే అవకాశం ఉంది.మొత్తంగా… సంక్రాంతి 2027పై ప్రస్తుతం టాలీవుడ్లో ఎంత హడావుడి ఉన్నా, దానికి ముందు వచ్చే డిసెంబర్ కూడా ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ప్రభాస్ ‘ఫౌజీ’, బాలయ్య 111, నాగార్జున ‘కింగ్ 100’, నాగ చైతన్య ‘వృషకర్మ’, దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’, రామ్ పోతినేని 23వ చిత్రం, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ ఇలా వరుసగా పెద్ద సినిమాలు డిసెంబర్ వైపు చూస్తున్నాయి. మరి ఏ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి.