ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ

Spread the love

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ ప్రయాణం అశేషాభిమానులను ఆకట్టుకుంటూ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ అద్భుతమైన ప్రయాణానికి గుర్తింపుగా ఢిల్లీలో నిర్వహించిన తొలి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ (IFFD) వేదికపై బాలకృష్ణకు  లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది.  నందమూరి తారక రామారావు వారసత్వాన్ని తీసుకుని సినిమాల్లో అడుగుపెట్టిన బాలకృష్ణ, తనకంటూ ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. గత ఐదు దశాబ్దాలుగా ఆయన నటించిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, మాస్ హీరోగా మాత్రమే కాకుండా పౌరాణిక పాత్రలు, చారిత్రక పాత్రలు, సామాజిక కథలు వంటి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ఈ విజయాలు ఆయనకు ప్రేక్షకులలో అపారమైన అభిమానాన్ని తెచ్చిపెట్టాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న భారత్ మండపంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఢిల్లీ సీఎం  రేఖా గుప్తా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఢిల్లీ ఆర్ట్, కల్చర్ అండ్ లాంగ్వేజెస్ మంత్రి కపిల్ మిశ్రా, డిప్యూటీ సీఎం  పర్వేష్ వర్మా, ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా, విద్యా మంత్రి ఆశిష్ సూద్ వంటి నాయకులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అలాగే బాలీవుడ్ ప్రముఖులు కంగనా రనౌత్, మనోజ్ తివారి, అరవింద్ స్వామి, హేమ మాలిని, శర్మిలా టాగోర్ వంటి ప్రముఖులు  ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచారు. ఇక  బాలకృష్ణతో పాటు ఈ వేడుకలో మరికొంత మంది సినీ దిగ్గజాలను కూడా సత్కరించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి శర్మిలా టాగోర్‌కు భారతీయ సినిమాకు చేసిన విశేష సేవలకు గాను ప్రత్యేక అవార్డు ప్రదానం చేశారు. లెజెండరీ నటుడు ధర్మేంద్రకు ప్రత్యేక నివాళి అర్పిస్తూ ఆయనకు మరణానంతరం ప్రత్యేక గౌరవాన్ని ప్రకటించారు. ఈ అవార్డును ఆయన భార్య, ప్రముఖ నటి హేమ మాలిని స్వీకరించారు. ధర్మేంద్ర భారతీయ సినీ పరిశ్రమలో చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ అక్కడున్నవారు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *