దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో అత్యంత పెద్ద విజయాలను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం ధురంధర్. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లో హీరోగా రణవీర్ సింగ్ నటించారు. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన రెండో భాగం Dhurandhar: The Revenge కూడా అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే దీంతో ఈ సినిమా సిరీస్ బాక్సాఫీస్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈనెల 19న విడుదలైన ధురంధర్ 2 సినిమా దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా దర్శకుడు కథను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ తో పాటు నటులందరూ తమదైన శైలిలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. ఆర్.మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, సారా అర్జున్, గౌరవ్ జెరా, డ్యానిష్ పండోర్, సౌమ్యా టాండన్, అశ్విన్ ధర్ అత్యద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.1000 కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది. ఇదిలా ఉండగా మొదటి భాగం ధురంధర్ సినిమా కూడా ప్రస్తుతం ఓటీటీలో మంచి ఆదరణ పొందుతోంది. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో రికార్డు వ్యూస్ సంపాదిస్తోంది.